‘టీ టైమ్‌’ దెబ్బకు ‘సానా’ ఔట్‌ ఆశ పెట్టి.. జెల్ల కొట్టి.. | Sana Satish Babu No Chance To TDP Kakinada MP Seat, Check Details Inside - Sakshi
Sakshi News home page

‘టీ టైమ్‌’ దెబ్బకు ‘సానా’ ఔట్‌ ఆశ పెట్టి.. జెల్ల కొట్టి..

Published Sun, Mar 24 2024 10:51 AM

Sana Satish Babu No Chnace To TDP Kakinada MP seat - Sakshi

కాకినాడ ఎంపీ సీటు ఇస్తామంటూ ఊరించిన చంద్రన్న

నమ్మి రూ.కోట్లు ఖర్చు చేసిన సతీష్‌

ఇప్పుడు జనసేన నేతకుఅప్పగించేందుకు యత్నాలు

బాబు, పవన్‌ల దెబ్బకు మరో వికెట్‌ ఫట్‌

ఎంపీ సీటు ఇస్తామంటూ తొలి నుంచీ ఆశ పెట్టారు. పార్టీ కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయించేశారు. బలి తీసుకునే వాడినే గొర్రె నమ్ముతుందన్నట్టు.. చంద్రన్న మాటలు నమ్మిన ఆ వ్యాపారవేత్త.. ఆయన బుట్టలో పడ్డారు. బాబుగారు చెప్పినట్టల్లా తలాడించారు. సీన్‌ కట్‌ చేస్తే.. చివరాఖరుకు చంద్రన్న ఖాతాలో మరో కరివేపాకుగా మారారు. అవసరానికి వాడుకోవడం.. ఆనక విసిరి పారేయడంలో ఆరితేరిన చంద్రబాబు చేతిలో.. టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ టికెట్టు ఆశించిన సానా సతీష్‌.. రాజకీయంగా ఖర్చయిపోయారు.
     
సాక్షి ప్రతినిధి, కాకినాడ: టీడీపీ, జనసేన పార్టీల్లో ఆశావహులను అయిన కాడికి వాడేసుకుని ఆనక కరివేపాకుల్లా తీసిపారేస్తున్నారు. ఎన్నికల్లో సీట్లు ఇస్తామంటూ ఆశలు కలి్పంచి, పార్టీ కార్యక్రమాల కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టించేస్తున్నారు. ఇక్కడ కాకపోతే ఇంకో సీటు వచ్చేస్తుందనే గంపెడాశతో ఆశావహులు కూడా భారీగానే చేతిచమురు వదిలించేసుకుంటున్నారు. ఈ తతంగమంతా పూర్తయి.. అభ్యర్థుల ప్రకటన దగ్గరకు వచ్చేసరికి లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్న వారిని అధినేతలు బకరాలను చేసేస్తున్నారు. వారికి మాటమాత్రంగానైనా చెప్పకుండా వేరేవారికి సీట్లు అప్పగించేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ సీటు ఆశించిన సానా సతీష్‌ను రాజకీయంగా బలి తీసుకున్నారని ఆ పార్టీలోని సీనియర్లు చెవులు కొరుక్కుంటున్నారు. 

పవన్‌ ప్రకటనతో.. 
పిఠాపురం నుంచి తాను, కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి టీ టైమ్‌ అధినేత తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ తనను ఎంపీగా పోటీ చేయాలని బీజేపీ అగ్రనేత అమిత్‌షా వంటి వారు ఒత్తిడి తెస్తే తాను, ఉదయ్‌ శ్రీనివాస్‌ తమ స్థానాలను మార్చుకుంటామని మళ్లీ కొద్ది రోజుల్లోనే చెప్పారు. దీనిపై అటు పిఠాపురం టీడీపీలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, ఆయన అనుచరులు మాటల మంటలు రేపుతూండగా.. ఇటు తనకు టీడీపీ నుంచి సానా సతీష్‌కు ఎంపీ సీటు గల్లంతైనే విషయం స్పష్టమైంది. టీ టైమ్‌ దెబ్బకు సానా సతీష్‌ టికెట్టు గోవిందా అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మాటవరసకైనా చెప్పకుండా.. 
కాకినాడకు చెందిన సానా సతీష్‌ ఏపీ ఈపీడీసీఎల్‌లో పని చేస్తూ.. ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి, మద్యం తదితర వ్యాపారాల్లో ఉన్నారు. ఆయనపై చంద్రబాబు వల వేశారు. కాకినాడ ఎంపీ సీటు ఇస్తామంటూ ఊరించారు. ఆయన మాటలు నమ్మిన సతీష్‌.. విపక్ష కూటమిలో ఎవరికి అవకాశం వచ్చినా కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో ఉండేది తానేనని ప్రచారం చేపట్టారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పోస్టర్లు, స్టిక్కర్లతో తన అనుచరుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. 

వాస్తవానికి టీడీపీ, జనసేన పొత్తులు తేలడానికి ఆరు నెలల ముందు నుంచే సతీష్‌ రూ.కోట్లు తగలేసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు జిల్లా పర్యటనలకు వచ్చిన సందర్భంలో ఆయా కార్యక్రమాలకు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇంత చేసినా చివరకు సతీష్‌ ఆశలకు గండి కొట్టారని ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇరు పారీ్టలూ ఒకే రకమైన పంథాలో తమను అవసరానికి వాడేసుకుని, సీట్లు ఇవ్వాల్సి వచ్చేసరికి కరివేపాకులను చేశారని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనకు సీటు ఎందుకు ఇవ్వడం లేదో కనీసం మాటవరసకైనా పిలిచి చెబుతారని సతీష్‌ ఆశించారు. కానీ, అలా జరగకపోవడాన్ని ఆయన వర్గం అవమానంగా భావిస్తోంది. 

ఎక్కడో తూర్పు గోదావరి జిల్లా కడియం మండలానికి చెందిన తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌కు ఎటువంటి సంబంధమూ లేని కాకినాడ ఎంపీ సీటు కేటాయించడం అవివేకమే అవుతుందని అంటున్నారు. ఆయన కోసం తామెందుకు త్యాగాలు చేయాలని వారు ప్రశి్నస్తున్నారు. ఈ సీటును హఠాత్తుగా జనసేనకు కట్టబెట్టేస్తే ఇంత కాలం ఇరు పారీ్టల కోసం పని చేసిన సతీష్‌ వంటి వారు ఏమైపోతారని ప్రశి్నస్తున్నారు. వ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి, అనుచరగణాన్ని అంతా కాకినాడలో మకాం చేయించి, గడచిన ఆరు నెలలుగా టీడీపీ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టిన తనకు సీటు సితార చేసేసి, తగిన బహుమతే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్యాగం పేరుతో తనను దూరం పెట్టడం బాధిస్తోందంటున్న సతీష్‌ వర్గీయులు.. త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement