సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి | Sakshi
Sakshi News home page

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి

Published Mon, Sep 4 2023 5:33 AM

Sanatana Dharma against social justice, must be destroyed..Udhayanidhi Stalin - Sakshi

చెన్నై: సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌ కొడుకు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని ఆయన కరోనా వైరస్, మలేరియా, డెంగీ జ్వరం, దోమలతో పోల్చారు. ఇలాంటి వాటిని వ్యతిరేకించడం కాదు, నాశనం చేయాలన్నారు. శనివారం చెన్నైలో తమిళనాడు ప్రోగ్రెసివ్‌ రైటర్స్‌ అండ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి మాట్లాడారు.

‘సనాతన్‌ అనేది సంస్కృత పదం. సనాతన్‌ అంటే ఏమిటి? ఇది శాశ్వతమైంది. అంటే మార్చేందుకు వీల్లేనిది. ఎవరూ ప్రశ్నించలేనిది. మతం, కులం ఆధారంగా ఇది ప్రజలను విడదీస్తుంది’ అని ఉదయనిధి అన్నారు. ‘సనాతన ధర్మం కారణంగా భర్త కోల్పోయిన మహిళలు నిప్పుల్లోకి నెట్టివేయబడ్డారు(గతంలో సతీసహగమనం). వితంతువులకు శిరోముండనం చేయించారు. తెల్ల చీరలు ధరింపజేశారు. బాల్య వివాహాలూ జరిగాయి. ద్రవిడ విధానంలో అటువంటి వాటిని లేకుండా చేశాం .

వారికి ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విశ్వకర్మ యోజన పథకం, 1953లో రాజగోపాలాచారి తీసుకువచ్చిన కులాధారిత విద్యా పథకం వంటిదే. డీఎంకే దీనిని గట్టిగా వ్యతిరేకిస్తుంది. వెనుకబడిన, అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యకు నోచుకోరాదనే నీట్‌ వంటి వాటిని కేంద్రం తీసుకు వచ్చింది. దీనిని మేం వ్యతిరేకిస్తున్నాం’అని ఉదయనిధి చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సనాతనం ఓడాలి, ద్రావిడం గెలవాలి అని ఉదయనిధి అన్నారు. ‘అన్ని కులాల వారు ఆలయా ల్లో అర్చకత్వానికి అర్హులేనంటూ కరుణా నిధి చట్టం తెచ్చారు. మన సీఎం స్టాలిన్‌ అర్చకత్వంలో శిక్షణ పొందిన వారిని ఆలయాల్లో పూజారులుగా నియమించారు. ఇదే ద్రవిడియన్‌ మోడల్‌’ అని ఆయన చెప్పారు.

అది విద్వేష ప్రసంగం: బీజేపీ
సనాతన ధర్మాన్ని ఆచరించే 80% మందిని సామూహికంగా చంపేయాలంటూ ఉదయనిధి వ్యాఖ్యానించడం విద్వేష ప్రసంగమేనని బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ అన్నారు. మిత్ర పక్షం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఒకవైపు ప్రేమ దుకాణం తెరుద్దామని పిలుపునిస్తుండగా డీఎంకే వారసుడు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నారన్నారు. సామూహికహననం వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మౌనం మద్దతు నివ్వడమే అవుతుంది. పేరుకుతగ్గట్లే ఇండియా కూటమికి అధికారమిస్తే వేలాది సంవత్సరాల భారత సంస్కృతిని ధ్వంసం చేస్తుంది’ అని పేర్కొన్నారు.

నేనలా అనలేదు: ఉదయనిధి
తన వ్యాఖ్యలపై చెలరేగిన విమర్శలపై ఉదయనిధి ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని సాధించడమే. సనాతన ధర్మం కారణంగా అణచివేతకు, నిర్లక్ష్యానికి గురైన వారి తరఫున మాట్లాడాను. నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని సామూహికంగా హతమార్చాలని మాత్రం నేను అనలేదు. సమాజంపై సనాతన ధర్మం ఎటువంటి చెడు ప్రభావం చూపిందనే విషయంలో అంబేడ్కర్, పెరియార్‌ వంటి వారు అధ్యయనం చేసి రాసిన పుస్తకాల్లో ఏముందో చూపిస్తాను. ఎటువంటి సవాళ్లయినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం’అని పేర్కొన్నారు.

ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని అవమానిస్తున్నారు
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
దుంగార్‌పూర్‌(రాజస్తాన్‌): సామాజిక న్యాయానికి, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమంటూ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మండిపడ్డారు. ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలు ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూ ఈ విధమైన ఆరోపణలకు దిగుతున్నాయని మండిపడ్డారు. లష్కరే తోయిబా కంటే హిందుత్వ సంస్థలే మరింత ప్రమాదకరమంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఇలాంటివి వీరికి కొత్తకాదు, ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారని పేర్కొన్నారు.

Advertisement
Advertisement