బీజేపీపై సత్యపాల్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు.. రాహుల్‌పై ప్రశంసలు

11 Sep, 2022 17:43 IST|Sakshi

బీజేపీలో అసంతృప్తి నెలకొందా?. సీనియర్‌ నేతలు బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుబడుతున్నారా? ఇటీవలి కాలంలో వారు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. బీజేపీ నిర్ణయాలపై ఎప్పుడూ బాణం ఎక్కుపెట్టే వరుణ్‌ గాంధీ సరసన మేఘాలయ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి పదవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 

అయితే, గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ మీడియాతో మాట్లాడుతూ.. నేను జమ్మూ కశ్మీర్‌కు గవర్నర్‌గా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకపోయి ఉంటే ఉప రాష్ట్రపతిని అయ్యేవాడినని అన్నారు. ఉప రాష్ట్రపతి పదవి నాకే ఇస్తున్నారనే సూచనలు అంతకు ముందే నాకు తెలిశాయి అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తనకు నచ్చిన విషయంపై మాట్లాడకుండా ఉండలేనని చెప్పారు.

కాగా, సత్యపాల్‌ మాలిక్‌ జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌గా ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శించారు. దీంతో బీజేపీ అధిష్టానం మాలిక్‌పై ఫోకస్‌ పెట్టింది. అనంతరం, మాలిక్‌ను మేఘాలయ గవర్నర్‌గా బదిలీ చేసింది. ఇక, తాజాగా కూడా సత్యపాల్‌ మాలిక్ కేంద్రంపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. దేశంలో జరుగుతున్న ఈడీ రైడ్లపై స్పందించారు. ఈడీ రైడ్లు ఎక్కువగా ప్రతిపక్ష నేతలపైనే జరుగుతున్నాయి. నిజానికి బీజేపీ నేతలపైనా ఈ దాడులు జరగాలి. ఎందుకంటే.. ఈడీ రైడ్లు జరపాల్సిన స్థితిలో బీజేపీ నేతలు కూడా ఉన్నారని బాంబు పేల్చారు.

మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్రను సత్యపాల్‌ మాలిక్‌ ప్రశంసించారు. ఈ సమయంలోనే యాత్ర చేపట్టిన రాహుల్‌ గాంధీపై ప్రశంసలు కురిపించారు. రాహుల్ గాంధీ తన పార్టీ కోసం మంచి పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అలాగే.. రైతుల సమస్యలపై కూడా మాలిక్‌ స్పందించారు. రైతులకే తన మద్దతు ప్రకటిస్తున్నట్టు స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరను కేంద్రం అమలు చేయకపోతే.. తానే రైతులకు మద్దతుగా ఆందోళనలు చేపడతానని వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు