MP Sanjay Raut: ఎంవీఏ కూటమిలోకి ఎంఐఎం ఆరాటం.. శివ సేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు

19 Mar, 2022 17:08 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి ఎంవీఏ(మహా వికాస్‌ అగాధి)లోకి ఏఐఎంఐఎంకు ప్రవేశం ఉంటుందా? అనే ప్రశ్నకు శివసేన స్పందించింది. ఎట్టిపరిస్థితుల్లో ఎంఐఎంను ఎంవీఏ కూటమిలోకి రానివ్వమని, అలాంటి అవకాశాలు ఇంచు కూడా లేవని స్పష్టత ఇచ్చారు శివ సేన ఎంపీ(రాజ్యసభ) సంజయ్‌ రౌత్‌. ఎంఐఎం పొత్తు అంశంపై స్పందించే క్రమంలో రౌత్‌.. కాస్త కటువుగానే స్పందించారు. 

ఎంఐఎం పొత్తు పెట్టుకోవడం అంటే.. ఓ రోగాన్ని అంటగట్టుకోవడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లి నమస్కరించే పార్టీతో మేం(శివ సేన) ఎలా పొత్తు పెట్టుకోగలం. దాని గురించి ఆలోచనే వద్దు. దాని గురించి ఆలోచించడం కూడా ఒక రోగమంతో సమానమే. శివ సేన.. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరిస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు సంజయ్‌ రౌత్‌. 

ఇక ఎంఐఎం పార్టీకి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, యూపీ ఎన్నికల్లో అది మరోసారి బయటపడిందని అన్నారాయన. అలాంటి పార్టీకి దూరంగా ఉండడమే మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు సంజయ్‌ రౌత్‌.

ఇక ఎంఐఎం నేత ఇంతియాజ్‌ జలీల్‌ ప్రతిపాదనపై ప్రశ్నించగా.. సంజయ్‌ రౌత్‌ స్పందించారు. మహారాష్ట్రలో మూడు పార్టీల ప్రభుత్వం(సేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ) ఉంది. నాలుగో పార్టీకి అవకాశమే లేదు. ఆయన(ఇంతియాజ్‌ జలీల్‌ను ఉద్దేశిస్తూ) ఒక ఎంపీ. అందుకే ఢిల్లీలో కలుసుకున్నాం. అంతేతప్ప.. దానర్థం కూటమిలోకి ఆహ్వానిస్తామని కాదు అని తెలిపారు రౌత్‌. 

అంతకు ముందు ఎంఐఎం నేత ఇంతియాజ్‌ జలీల్‌ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేతను కలిసినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అయితే ఇది శివసేనకు ఆమోదయోగ్యం కాదని మాకు తెలుసు. మేము ప్రతిపాదన ఇచ్చాము కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం అని ఇంతియాజ్‌ జలీల్‌ వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉండగా.. పొత్తుల వ్యవహారంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్‌ స్పందించారు. పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయని.. కానీ, దేశ ప్రజలు ప్రధాని మోదీ వెంటనే ఉన్నారని, రాబోయే రోజుల్లో గెలుపు బీజేపీదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిపై స్పందిస్తూ.. ఎంత మంది వచ్చినా ఒక్కటేనని, ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎం ఆరోపణలు చేసేవాళ్లు.. ఇప్పుడు ఎంఐఎంను ‘బీజేపీ బీ టీం’ అంటున్నారని, అలాంటి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరమే లేదని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు