Somu Veerraju Comments On TDP: రాజకీయాల్లో టీడీపీకి నీతి నిజాయితీ ఉన్నాయా? - Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో టీడీపీకి నీతి నిజాయితీ ఉన్నాయా?

Published Thu, Dec 30 2021 4:02 AM

Somu Veerraju Comments On TDP - Sakshi

సాక్షి, అమరావతి:  బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత మధ్యలో వదిలేసి కాంగ్రెస్‌తో కలిసిన టీడీపీకీ రాజకీయాల్లో నీతి నిజాయితీ ఉన్నాయా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. బుధవారం పార్టీ సహచరులతో కలిసి విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోనియా కొడుకు పక్కకు తోసేస్తున్నా చంద్రబాబు వెళ్లి ఆయన భుజం మీద చెయ్యి వేసిన ఘటనను కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో అప్పట్లో అందరూ చూశారని  వీర్రాజు చెప్పారు. మామ మీద ఓ పోటు, వేటు వేసి అధికారంలోకి వచ్చిన వాళ్లకు బీజేపీ గురించి మాట్లాడే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తుతో, వాజ్‌పేయి గ్లామర్‌తో 1999లో చంద్రబాబు గెలిచారని చెప్పారు. 2004లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఆయనతోపాటు బీజేపీ ఓటమికి కారణమయ్యారన్నారు. 2014లో మరోసారి మోదీ హవాతోనే చంద్రబాబు గెలిచారని చెప్పారు. ఒంటరిగా పోటీ చేసి 2019లో ఓడిపోయారని గుర్తుచేశారు.  

ఇక దూకుడుతో కార్యక్రమాలు 
రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ శూన్యత ఉందని.. రాబోయే రోజుల్లో పార్టీ ఇంకా దూకుడు ప్రదర్శిస్తుందని వీర్రాజు చెప్పారు. సీపీఐ ఒక పార్టీనేనా అని ప్రశ్నించారు. చందాలు వసూలు చేసుకుంటూ రామకృష్ణ జీవిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మద్యం ధరలపై మాట్లాడిన మాటలకు వివరణ ఇస్తూ.. పేదల పక్షాన, మహిళా తల్లుల పక్షాన తాను అలా మాట్లాడానని చెప్పారు. మద్యం తాగడాన్ని ప్రోత్సహించాలని, వాళ్లతో తాగిపించాలని మాట్లాడలేదన్నారు. చిన్న వీక్‌నెస్‌ను అడ్డంపెట్టుకొని వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. మద్యం రేటు తగ్గిస్తే ఒక సీసా తాగే వారికి నెలకు రూ.6 వేలు, రెండు సీసాలు తాగే వారికి రూ.12 వేలు ఇచ్చినట్టు అని చెప్పారు.  

ఫుల్‌ గ్లాస్‌ టీనే కావాలి.. 
బీజేపీ–జనసేన పొత్తుపై వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికీ పొత్తునే కోరుకుంటున్నామని, కాకపోతే ఫుల్‌ గ్లాస్‌ టీ కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఎదగకూడదనే టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతలు తాము ఒకరికి అనుకూలం, మరొకరికి వ్యతిరేకం అంటూ మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని చెప్పారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement