వద్దు బాబూ..మీకో దండం! | Sakshi
Sakshi News home page

వద్దు బాబూ..మీకో దండం!

Published Fri, Jan 12 2024 5:26 AM

survey opposite of Chandrababu in his own district - Sakshi

సాక్షి, తిరుపతి: అపర చాణక్యుడిగా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లాపడటం ఖాయంగా కనిపిస్తోంది. సొంత జిల్లా­లో ఓటమి భయం ఆయన్ను వెంటాడుతోంది. చి­త్తూరు జిల్లా మొత్తం వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని సర్వేలు తేటతెల్లం చేస్తుండటంతో టీడీపీ నుంచి అభ్యర్థులుగా బరిలో దిగేందుకూ నాయకులు వెనకాడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆ పార్టీ ఇంకా అభ్యర్థుల కోసం వెంపార్లుడుతోంది. తిరుపతి, చిత్తూరు పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదు.

గత ఎన్నికల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన పనబాక లక్ష్మి ప్రస్తుతం బరిలోకి దిగేందుకు ససేమి­రా అంటున్నారు. చిత్తూరు పార్లమెంట్‌కు అంజ­నం వే­సినా అభ్యర్థి కనిపించటం లేదు. ఇక అసెంబ్లీ స్థా­నాల విషయానికొస్తే అభ్యర్థులు పూర్తిగా ఆశలు వ­దు­లుకున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడు­తు­న్నా కనీసం అభ్యర్థులు కూడా దొరక్కపోవటంతో ఇటు టీడీపీ, అటు జనసేన పార్టీలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి.  

సర్వేలో బహిర్గతమైన ఓటమి  
చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే కూడా నిర్వహించుకున్నట్లు సమాచారం. ఆ సర్వేలో చంద్రబాబు ఓటమి అంచున ఉన్నారని స్పష్టమవడంతో మరో స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ఇటీవల మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించి మరోసారి అమలు చేయలేని హామీలు కురిపించారు.

కుప్పంలో విమానాశ్రయం నిర్మించి అమెరికాకు కూరగాయలు అమ్మిస్తానని మోసపూరిత ప్రకటనలు చేశారు. చంద్రబాబు చేసిన ప్రకటనతో కుప్పం వాసులు ఇలాంటి వ్యక్తినా తాము ఇన్నేళ్ల నుంచి గెలిపిస్తూ వచ్చింది? అని నోరెళ్లబెట్టారు. ఇన్నేళ్లు చంద్రబాబుని గెలిపిస్తున్నా కనీసం స్థానికంగా సొంత ఇల్లు కూడా లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో శాంతిపురం మండలంలో హడావుడిగా ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. 

మాజీ మంత్రికి ఓటమి భయం 
పలమనేరు టీడీపీ నేత చంద్రబోస్‌ వైఎస్సార్‌సీపీలో చేరిపోవటంతో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డికి మరోసారి ఓటమి భయం పట్టుకుంది. గతంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా గెలిచి, టీడీపీ అధికారంలోకి వచ్చిందని తిరిగి పచ్చకండువా కప్పుకున్నందుకు 2019తో అమర్‌కు స్థానికులు గుణపాఠం చెప్పారు. చంద్రబాబుతో పాటు అమర్‌నాథ్‌రెడ్డిని వెన్నుపోటు వెంటాడుతోంది. పూతలపట్టు అభ్యర్థి మురళీమోహన్‌పై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. మరో వ్యక్తికి టికెట్‌ ఇప్పించేందుకు స్థానిక టీడీపీ నేతలు అమరావతి చుట్టూ తిరుగుతున్నారు.

పొత్తులో భాగంగా జిల్లా కేంద్రాలైన చిత్తూరు, తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌పై జనసేన ఆశలు పెట్టుకుంది. అయితే ఆ  రెండు చోట్లా తన అభ్యర్థులనే బరిలోకి దింపాలని చంద్రబాబు ప్రణాళిక రచించారు. అందులో భాగంగా చంద్రబాబు తన పార్టీకి చెందిన టీటీడీ బోర్డు మాజీ చైర్మెన్‌ డీకే ఆదికేశవులు నాయుడు మనుమరాలు చైతన్యను రంగంలోకి తీసుకొచ్చారు. జనసేన తరుపున చిత్తూరు లేదా శ్రీకాళహస్తి టికెట్‌ ఇప్పించేందుకు బాబు స్కెచ్‌ వేశారని ప్రచారం జరుగుతోంది.  

అభ్యర్థుల కోసం అన్వేషణ 
గంగాధర నెల్లూరు స్థానానికి అసలు టీడీపీ నుంచి అభ్యర్థే లేరు. సరైన నాయకుడు దొరక్కపోవటంతో సీటు కోసం చాలా మంది పోటీపడుతున్నారంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. పుంగనూరులో మరొకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం ఖాయం అని తెలిసినా పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. అక్కడ చల్లా రామచంద్రారెడ్డి సరైన అభ్యర్థి కాదనే నిర్ణయానికి వచ్చారు. సోషల్‌ మీడియా ప్రతినిధులకు ప్యాకేజీ ఇచ్చి ప్రచారం చేసుకుంటూ హడావుడి చేస్తున్న రామచంద్రయాదవ్‌ని జనసేన నుంచి అభ్యర్థిగా బరిలోకి దింపాలని చూస్తున్నారు.

చంద్రగిరిలో ఈ సారి కూడా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఢీకొట్టటం సాధ్యం కాదని, సొంత సర్వేల్లో కూడా టీడీపీకి ఓటమి ఖాయమని తేలిపోయింది. దీంతో ప్రస్తుతం అభ్యర్థిగా ప్రకటించుకుంటున్న పులివర్తి నానిని పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగానే ఇద్దరు వ్యక్తుల పేర్లను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. ఈ విషయంపైనా పులివర్తి నాని వర్గీయులు చంద్రబాబు తీరుపై భగ్గుమంటున్నారు.  

తిరుపతిలో పలాయనమే.. 
తిరుపతిలో జనసేన అభ్యర్థిని పోటీలోకి దించడం చంద్రబాబుకు ససేమిరా ఇష్టం లేదు. అందుకే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు జనసేన కండువా కప్పించాలని నిర్ణయానికి వచ్చారు. జనసేన అభ్యర్థిగా తన పార్టీ నాయకురాలు సుగుణమ్మను బరిలోకి దించనున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న జనసేన సైనికులు చంద్రబాబు కుట్రలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి జెండా మోస్తున్న తమకు కేటాయించకుండా పథకం ప్రకారం టీడీపీ వారినే జనసేన అభ్యర్థులుగా దింపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పిన దానికి పవన్‌ తలూపటంపైనా జనసైనికులు మండిపడుతున్నారు. 

పచ్చకండువా కప్పుకున్న నాయకులకు గింగిరాలే.. 
వెంకటగిరిలో  వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలుపొంది ప్యాకేజీ కోసం పచ్చకండువా కప్పుకున్న ఆనం రాంనారాయణరెడ్డిపై స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆనంకి టికెట్‌ ఇస్తే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సు«దీర్‌రెడ్డిపై నమ్మకం లేకపోవటంతో ఎస్సీవీ నాయుడు లేదా మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మెన్‌ గురవయ్య నాయుడు కుమారుడు లేదా ఆయన కోడల్ని రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సత్యవేడులో టీడీపీ ఓటమి ఖాయం కావటంతో డాక్టర్‌ హెలెన్, జేడీ రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆదిత్య మధ్య పోటీ రాజేశారు. ఒకరికి తెలియకుండా ఒకరితో మాట్లాడుతూ వారి మధ్య విభేదాలు సృష్టించారు. సీటు కోసం పోటీపడుతున్నట్లు డిమాండ్‌ సృష్టించారు. సూళ్లూరుపేట నుంచి గతంలో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సారి బరిలో దిగేందుకు సుముఖంగా లేరు. చెన్నైలో స్థిరపడిన ఓ వైద్యుడిని పోటీ చేయాలని అభ్యర్థించినట్లు తెలిసింది. ఆయన అంగీకరించడంతో ముందుగా రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన ఆలోచనలో ప­డ్డారు.

గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్‌ పేరు వినిపిస్తున్నా, ఆయన  గతంలో వైఎస్సార్‌సీపీ గుర్తుతో గెలుపొంది ప్యా­కేజీ కోసం పచ్చ కండువా కప్పుకున్నారు. సునీల్‌ని బరిలోకి దింపాలా? లేదా జనసేనలో చురుగ్గా ఉన్న తీగల చంద్రశేఖర్‌ని పోటీకి దింపాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తంగా చూస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తుండటంతో చంద్రబాబు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.   

Advertisement
Advertisement