AP MPTC ZPTC Results 2021: ఆ ఎనిమిది చోట్లా ఫలితాలు నిలిపివేత | List Of 8 Places Results Not Announced - Sakshi
Sakshi News home page

MPTC, ZPTC Election Results: ఆ ఎనిమిది చోట్లా ఫలితాలు నిలిపివేత 

Published Tue, Sep 21 2021 3:24 AM

Suspension results in those eight places Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఏడు ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల ఫలితాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నిలిపివేసింది. వాటి పరిధిలోని మొత్తం 18 బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశించింది. ఆ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్‌ పత్రాలు పూర్తిగా తడిసిపోయి లెక్కింపునకు వీలుగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలోని గొరిగనూర్‌ ఎంపీటీసీ పరిధిలోనున్న రెండు పోలింగ్‌ బూత్‌లలో మొత్తం 742 ఓట్లు పూర్తిగా తడిసిపోయాయి. అయితే, అక్కడి ఓట్లన్నీ లెక్కించగా, అత్యధిక ఓట్లు దక్కించుకున్న అభ్యర్థి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి మధ్య 517 ఓట్ల తేడా ఉంది. దీంతో అక్కడ రెండు బూత్‌ల పరిధిలో తడిసిపోయిన 742 ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఆ ఫలితాన్ని నిలిపివేయాలని జిల్లా అధికారులను ఎస్‌ఈసీ ఆదేశించింది. అదే సమయంలో గొరిగనూర్‌ ఎంపీటీసీ ఫలితాన్ని కూడా నిలిపివేశారు. బ్యాలెట్‌ పత్రాలు తడిసిపోయిన రెండు బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించి, ఆ ఓట్ల ఆధారంగా జమ్ములమడుగు జెడ్పీటీసీ, గొరిగనూర్‌ ఎంపీటీసీ స్థానం ఫలితాలను అధికారులు ప్రకటిస్తారు. అలాగే..  

► శ్రీకాకుళం జిల్లా మందస మండలం అంబుగం ఎంపీటీసీ పరిధిలోని నాలుగు పోలింగ్‌ బూత్‌లు, ఆమదాలవలస కాత్యాచారులపేట ఎంపీటీసీ పరిధిలోని ఒక బూత్‌ పరిధిలో ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్‌ పత్రాలు తడిసిపోవడంతో ఆ రెండు ఎంపీటీసీ స్థానాల ఫలితాలను కూడా నిలిపివేసి, అక్కడ రీ పోలింగ్‌ నిర్వహించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది. 
► ఇదే కారణంతో విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలం పాకాలపాడు ఎంపీటీసీ స్థానం ఫలితాన్నీ నిలిపివేశారు. అక్కడ రెండు బూత్‌లో రీపోలింగ్‌ నిర్వహిస్తారు.  
► తూర్పు గోదావరి జిల్లా మారేడుమల్లి మండలం దోరచింతలపాలెం ఎంపీటీసీ, పెద్దాపురం మండలం పులిమేరు ఎంపీటీసీ స్థానం ఫలితాలను కూడా నిలిపివేశారు. దోరచింతలపాలెంలో ఏడు, పులిమేరులో ఒక బూత్‌లలో రీ పోలింగ్‌కు ఆదేశించారు.  
► వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీ ఫలితం కూడా బ్యాలెట్‌ పత్రాలు తడిసిన కారణంగానే నిలిచిపోయింది. ఇక్కడ ఒక బూత్‌ పరిధిలో రీపోలింగ్‌ జరుగుతుంది. 

ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికలను ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీచేసినందున ఈ 18 చోట్లా 25వ తేదీ తర్వాతే రీ పోలింగ్‌ నిర్వహించే 
అవకాశముందని ఎస్‌ఈసీ అధికారులు వెల్లడించారు.    

Advertisement
Advertisement