అడ్డదారిలో సీఎం కాలేదు.. 

22 Mar, 2021 15:22 IST|Sakshi

ప్రచార హోరు

అగ్రనేతల మధ్య సమరం

పరస్పరం విమర్శలు, ఆరోపణలుకాలి

నొప్పితోనూ కమల్‌ ప్రచారం 

సాక్షి, చెన్నై: ప్రచారంలో ప్రధాన కూటముల సీఎం అభ్యర్థులు పళనిస్వామి, స్టాలిన్‌ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆదివారం సాగిన ప్రచారంలో పరస్పరం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకున్నారు. మూడో కూటమి సీఎం అభ్యర్థి కమల్‌ కాలి గాయం వేధిస్తున్నా ప్రచారబాటలో పడ్డారు.  అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాలే సమయం ఉండడంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆదివారం సెలవు  కావడంతో జనం ఇళ్ల వద్దకే పరిమితం కావడాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటింటి ప్రచారం హోరెత్తింది. తమ నేతృత్వంలో గతంలో సాగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

డీఎంకే, అన్నాఎంకే పార్టీలు రూపొందించి మేనిఫెస్టో అంశాలతో కూడిన కరపత్రాల్లో పథకాలకు ప్రత్యేక ఆకర్షణ పేరిట ఒకే మహిళ ఫొటోను పొందు పరిచి ఉండడం అనేక చోట్ల గందరగోళం తప్పలేదు. అగ్రనేతలు ప్రచారంలో మాటల జోరు పెంచారు. అనేకచోట్ల అధికార అభ్యర్థులకు ప్రజల నుంచి వ్యతిరేకత రాగా, మరికొన్ని చోట్ల పుష్పాలతో ఆహ్వానాలు పలికిన ఓటర్లూ ఉన్నారు. అనేక జిల్లాల్లో భానుడు భగభగ మని ప్రతాపం చూపించినా, ఉక్క పోత నడుమ ప్రచారంలో అభ్యర్థులకు ముచ్చెమటలు తప్పలేదు.

ద్రోహం పెను విషం.. 
కాంచీపురం జిల్లా పరిధిలోని ఉత్తర మేరు పరిసరాల్లో స్టాలిన్‌ ప్రచారం సాగింది. ఆయన మాట్లాడుతూ ప్రకృతి విలయాలు, కరోనా విపత్తుల సమయంలో కేటాయించాల్సిన నిధుల్ని సరిగ్గా ఇవ్వలేదని ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్న వ్యక్తి,  ఎందుకు బీజేపీతో తాజాగా పొత్తు పెట్టుకున్నారో అని ప్రశ్నించారు. పదవి ఇచ్చిన శశికళ గుండెల్లోనే తన్నిన వ్యక్తి పళని స్వామి  అని పేర్కొన్నారు. పదే పదే తానేదో రైతు అని పళని జబ్బలు చరస్తున్నాడని, నిజంగా రైతే అయితే, ఎందుకు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చారో అని ప్రశ్నించారు. 

అడ్డదారిలో సీఎం కాలేదు.. 
తిరువణ్ణామలై జిల్లా ఆరణి, వందవాసిల్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కో-కన్వీనర్‌ పళనిస్వామి సుడిగాలి పర్యటనతో ఓటర్ల వద్దకు వెళ్లారు. ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను, కరుణానిధిని టార్గెట్‌ చేశారు. అన్నా మరణం తర్వాత నావలన్‌ నెడుం జెలియన్‌ సీఎం కావాల్సి ఉండగా, అడ్డదారిలో కరుణానిధి ఆ కుర్చీని కైవసం చేసుకున్నారని ధ్వజమెత్తారు. ఆయనలా తానేమి అడ్డదారిలో సీఎం కాలేదని, అన్నాడీఎంకే శాసన సభా పక్షం మద్దతుగా ఆ పదవిలో కూర్చున్నట్టు పేర్కొన్నారు. తాను రైతునని, అందుకే రైతు సంక్షేమం కోసం శ్రమిస్తున్నానని తెలిపారు.

అయితే, తననే కాదు, రైతుల్ని కూడా కించ పరిచే విధంగా హేళన చేస్తూ స్టాలిన్‌ వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి చరిత్రను ఆయన చూసుకుంటే మంచిదని, లేని పక్షంలో గట్టిగానే స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేస్తే, ప్రతి దాడికి తానూ రెడీ అని సవాల్‌ చేశారు. అన్నాడీఎంకేకు ప్రజలే వారసులని, అవినీతి పుట్ట డీఎంకేకు ఈ ఎన్నికల్లో మళ్లీ గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.  

కాలి నొప్పితోనూ.. 
మక్కల్‌ నీది మయ్యం నేత, కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి కమలహాసన్‌ గతంలో కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రచారంలో ఆయనకు ఇబ్బందిగా మారినట్టుంది. కాలి గాయం బాధిస్తున్నట్టుంది. అయినా, లెక్కచేయకుండా ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. ఆదివారం నియోజక వర్గం పరిధిలో ఉక్కడం పరిసరాల్లోని మైనారిటీలు అధికంగా ఉండే చోట్ల నడుచుకుంటూ కాసేపు, ఓపెన్‌ టాప్‌ వాహనంలో మరికాసేపు ప్రచారంలో ముందుకు సాగారు. డీఎంకేతో, బీజేపీతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదని, రాజకీయంగా తనను ఎదుర్కొనలేక ఈ విమర్శలు చేస్తున్నారని మైనారిటీల దృష్టికి కమల్‌ తీసుకెళ్లారు. తనకు కాషాయం రంగు పూయవద్దు అని విజ్ఞప్తి చేశారు. నామ్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్‌ ప్రచార సభలతో దూసుకెళుతున్నారు.

చదవండి: చెత్తకుప్ప పక్కన ప్రముఖ విలన్.. చివరికి!  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు