బీజేపీ, కాంగ్రెస్‌ల చీకటి ఒప్పందం | Sakshi
Sakshi News home page

బీజేపీ, కాంగ్రెస్‌ల చీకటి ఒప్పందం

Published Sat, Apr 13 2024 6:23 AM

Tanniru Harish Rao comments over congress and bjp - Sakshi

బీజేపీని గెలిపించేందుకు చాలా చోట్ల కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులు

అబద్ధాల్లో బీజేపీ బడేమియా.. కాంగ్రెస్‌ చోటేమియా

సీఎం రేవంత్‌ చెడ్డీగ్యాంగ్‌ సభ్యుడా 

సమైక్యవాదుల అడుగులకు మడుగులొత్తడం మానుకో

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు

కరీంనగర్, సాక్షి, సిద్దిపేట: ఉద్దెరమాటల కాంగ్రెస్, మోసపూరిత వాగ్దానాల బీజేపీలు రాష్ట్రంలో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నాయని, రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు దోహదపడే విధంగా కాంగ్రెస్‌ బలహీనమైన, డమ్మీ అభ్యర్థులను నిలబెడుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా రోడ్‌షో నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదని, ఉద్యమ సందర్భంలో రేవంత్‌ కరీంనగర్‌కు తుపాకీ పట్టుకొని బయలుదేరిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాకుంటే రేవంత్‌ సీఎం అయ్యేవారా అని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ దిగజారుడు మాటలు మాట్లాడటం మానుకోవాలని, విమర్శలకు జవాబు ఇవ్వాల్సిన సీఎం మాజీ సీఎం కేసీఆర్‌ను చెడ్డీ విప్పుతానని మాట్లాడటం ఏమిటని నిలదీశారు.

రేవంత్‌ ఏమైనా చెడ్డీ గ్యాంగ్‌ సభ్యుడా అంటూ ఫైర్‌ అయ్యారు. కరీంనగర్‌లో ఎంపీ బండి సంజయ్‌ చేసిన అభివృద్ధి చెప్పమంటే క్యాలెండర్లు, చిత్రపటాలు చూపుతూ ఓట్లు అడగటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సమైక్యవాదుల అడుగులకు మడుగులొత్తే కాంగ్రెస్, బీజేపీలతో పెనుప్రమాదం పొంచి ఉందని, రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కి అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, మేయర్‌ వై.సునీల్‌రావు పాల్గొన్నారు.

నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌లో లుకలుకలు
సీఎం రేవంత్‌ రెడ్డి దగ్గర సరుకు లేదని.. అందుకే లీకులు, ఫేకు వార్తలతో కాలం గడుపుతున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సిద్దిపేట పట్టణ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో లుకలుకలు మొదలయ్యాయన్నారు. అబద్ధాల్లో బీజేపీ బడేమియా అయితే.. కాంగ్రెస్‌ చోటేమియా అని విమర్శించారు.

మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌తో పాటు మరికొన్ని చోట్ల బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు.  ఉప ఎన్నికల్లో అబద్ధాలతో గెలిచి మాట తప్పిన రఘునందన్‌ రావుకు అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు బుద్ధి చెప్పారని , దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్‌లో ఎట్లా చెల్లుతుందని ప్రశ్నించారు. కాగా, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు బీఆర్‌ఎస్‌కే ఓటు వేస్తామంటూ చేసిన ఏకగ్రీవ తీర్మానం కాపీని హరీశ్‌రావుకు అందించారు.

Advertisement
Advertisement