కవ్వించి కయ్యానికి.. టీడీపీ నిజ నిర్ధారణ ఆంతర్యం ఇదే | Sakshi
Sakshi News home page

కవ్వించి కయ్యానికి.. టీడీపీ నిజ నిర్ధారణ ఆంతర్యం ఇదే

Published Sun, Jan 23 2022 3:16 AM

TDP Chief Chandrababu Politics In Gudivada Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: అధికారం పోయింది.. నాయకులు కరువైపోతున్నారు.. కేడర్‌ కనుమరుగైపోతోంది.. జనంలో పరపతి పోయింది.. దీంతో ఏంచేయాలో పాలుపోని టీడీపీ అధినాయకత్వం అధికార పార్టీ నేతలు, కార్యకర్తలతో కవ్వించి మరీ కయ్యానికి కాలు దువ్వుతోంది. అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తోంది. ఏదో ఒక అంశంపై వివాదం సృష్టించడం, రెచ్చగొట్టడం, ప్రశాంతంగా ఉన్న పల్లెలు, పట్టణాల్లో చిచ్చు రాజేయడం పనిగా పెట్టుకుంది. నిజ నిర్థారణ కమిటీల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రాద్ధాంతాలకు వ్యూహ రచన చేస్తున్నారు. ఇటీవల కృష్ణాజిల్లా గుడివాడలో కాసినో నిర్వహించినట్లు ఎల్లో మీడియా కథనాలు వండి వార్చగా, వెంటనే చంద్రబాబు దానిపై నిజ నిర్ధారణ కమిటీని నియమించారు.

వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజా, తంగిరాల సౌమ్యను కమిటీ సభ్యులుగా గుడివాడ పంపారు. వీరు అక్కడకు వెళ్లక ముందే టీడీపీ నేతలు మంత్రి కొడాలి నాని కాసినో నిర్వహించారని మూకుమ్మడి దాడి మొదలు పెట్టారు. శుక్రవారం కమిటీ గుడివాడ వెళ్లింది. వాస్తవానికి కమిటీ సభ్యులే అక్కడికి వెళ్లి, నిజానిజాలు వెలికితీయాలి. కానీ, గుంటూరు, విజయవాడ నుంచి వందల మందిని పంపించారు. వారంతా గుడివాడ వెళ్లి వైఎస్సార్‌సీపీ నేతలను కవ్వించారు. ఎల్లో, సోషల్‌ మీడియాల ద్వారా సవాళ్లు విసురుతూ, ముఖ్యమంత్రి జగన్, మంత్రి కొడాలి నానీపై విమర్శలు చేస్తూ తీవ్రస్థాయిలో రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారు. దీంతో రెండు గ్రూపుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే ఇరు వర్గాలను నియంత్రించారు. లేకపోతే గుడివాడలో రణరంగాన్ని సృష్టించాలని టీడీపీ నేతలు రంగం సిద్ధం చేశారు. ఇంతకు ముందు కూడా అధికార వైఎస్సార్‌సీపీకి సంబంధం లేని పలు అంశాల్లో టీడీపీ ఇదే విధంగా వ్యవహరించింది. 

► ఇటీవల గుంటూరు జిల్లా నర్సరావుపేటలో వైఎస్సార్‌ విగ్రహాన్ని మాయం చేసి ఘర్షణలు సృష్టించడానికి టీడీపీ విఫలయత్నం చేసింది.
► గుంటూరు జిల్లా మాచర్ల మండలం వెల్దుర్తిలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాజకీయం చేసేందుకు చంద్రబాబు స్వయంగా అక్కడికి వెళ్లి అభాసుపాలయ్యారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వందలాది మందిని అక్కడికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ పన్నాగం ఆడియో టేపులు బహిర్గతమవడంతో టీడీపీ బండారం బయటపడింది. టీడీపీ నేతలు బొండా ఉమ, బుద్ధా వెంకన్న గతంలో మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు కారణమైన ఉదంతాలున్నాయి.
► తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప తదితరులతో నిజ నిర్థారణ కమిటీని వేసి అక్కడ హైడ్రామా సృష్టించేందుకు ప్రయత్నించారు. ఇలా ఎక్కడ ఏ చిన్న విషయం దొరికినా దాన్ని రాష్ట్ర స్థాయి వివాదంగా మార్చి, వైఎస్సార్‌సీపీకి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అంటగట్టి బురద జల్లడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అయితే, వాస్తవాలను గమనిస్తున్న ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదు. కనీసం ఆయన పార్టీ కేడర్‌ కూడా మద్దతివ్వడంలేదు. ఇందుకు శుక్రవారం గుడివాడలో కమిటీ పర్యటనే ఉదాహరణ. అక్కడకు వెళ్లిన టీడీపీ నేతలకు స్థానిక కేడర్‌ అండ లేకుండా పోయింది. స్థానిక నేతలు కూడా దూరంగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం, టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో చంద్రబాబు ఇలాంటి వివాదాలతో వార్తల్లో నిలవాలని ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement