దిక్కుతోచని ‘కూటమి’! | Sakshi
Sakshi News home page

దిక్కుతోచని ‘కూటమి’!

Published Wed, Mar 27 2024 5:28 AM

TDP got the Ongole Parliament seat - Sakshi

పొత్తులో భాగంగా టీడీపీకి దక్కిన ఒంగోలు పార్లమెంట్‌ స్థానం

అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు.. బీసీ నేతకు బాబు హ్యాండ్‌  

మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న ఢిల్లీ లిక్కర్‌ స్కాం 

వారికిస్తే మోదీ ఆగ్రహిస్తారన్న సందిగ్ధంలో టీడీపీ అధినేత 

ప్రచారంలో దూసుకుపోతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మల్లగుల్లాలు పడుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానం తెలుగుదేశం పార్టీకి దక్కింది. రోజులు గడుస్తున్నా అభ్యర్థి ఎవరో తేల్చకుండా నాన్చుతోంది. ప్రస్తుతం మాగుంట కుటుంబానికి సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఈ కుటుంబం పాత్ర ఉండటంతో ఏం చేయాలో తెలియక సందిగ్ధ పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిసింది.

ఈ ఎన్నికల్లో తప్పకుండా బీసీ నేతకు ఎంపీగా టికెట్‌ ఇస్తానని ఇచ్చిన హామీని బాబు గాలికొదిలేశారు. ఎన్నికలు వేడెక్కుతున్నా అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో మూడు పార్టీల నేతలు, కేడర్‌ అయోమయంలో పడ్డారు. వాస్తవంగా రెండు నెలల ముందు వరకూ ఈ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థి కరువయ్యారు. పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.

ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు ముందుంచారు. అయితే ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పి­స్తానని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు హామీ ఇచ్చారు. తీరా ఎన్నికల వేడి మొద­లయ్యే నాటికి బాలాజీ పేరు మరుగున పడిపోయింది. బీసీలకు ఎప్పటిలాగే మొండిచేయి చూపారు.  

తొలుత రాఘవరెడ్డి పేరు.. 
టీడీపీలో చేరిన మాగుంట ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా తన కుమారుడు రాఘవరెడ్డిని నిలబెట్టాలని జోరుగా ప్రచారం చేసుకున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ అడ్డం పడింది. దాంతో   రాఘవరెడ్డి స్థానంలో ఎంపీ శ్రీనివాసులు రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో తన తండ్రి శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని రాఘవరెడ్డి ఒక ప్రకటన కూడా విడుదలచేశారు. అయితే ఇప్పటివరకు చంద్రబాబు మాత్రం ఏ ఒక్కరి పేరూ ప్రకటించకపోవటం గమనార్హం. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు.

మాగుంట రాఘవరెడ్డిని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతంలో అరెస్ట్‌ చేయగా తీహార్‌ జైలులో కొంతకాలం రిమాండ్‌లో ఉండి ప్రస్తు­తం బెయిల్‌పై వచ్చారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కూడా అరెస్ట్‌ చేశారు.  కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను కూడా తిహార్‌ జైలుకు పంపారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు.. మాగుంట కుటుంబం విషయంలో డోలాయమా­నంలో పడ్డాడన్న ప్రచారం సాగుతోంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవరెడ్డి ఇరువురూ ఈడీ ముందు అప్రూవర్లుగా మారిన సంగతి తెలిసిందే.

మాగుంట కుటుంబాన్ని వెంటాడుతున్న లిక్కర్‌ స్కాం 
ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థికంగా దన్ను ఉన్న వ్యక్తి కోసం టీడీపీ గాలింపు మొదలెట్టింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీని­వా­సులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పేరు బయటకు రావడంతో అప్పటినుంచే వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వారిని పక్కనపెట్టిన విషయం విధితమే.

ఒంగోలు ఎంపీ సీటు ఆ కుటుంబానికి ఇచ్చేదిలేదని కూడా ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు. దీంతో మాగుంట టీడీపీ తీర్థం పుచ్చుకున్నా ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిత్వంపై నేటికీ చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఉన్న మాగుంట కుటుంబానికి టికెట్‌ ఇస్తే ప్రధాని మోదీ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందేమోనన్న సందిగ్ధ­ంలో బాబు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.  

ప్రచారంలో దూసుకుపోతున్నచెవిరెడ్డి భాస్కరరెడ్డి
టీడీపీ, ఎన్‌డీఏ కూటమి పరిస్థితి కుడితో పడిన ఎలు­కల చందంగా ఉంటే వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను సీఎం జగన్‌  ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రక­టించిన తరువాత జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంట్‌ పరిధి­లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కలిసి గ్రామ గ్రామాన ఆయన  ప్రచారం చేసుకుంటూ ప్రజలతో మమేకమవుతున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement