ఎల్లో కల్లోలం | Sakshi
Sakshi News home page

ఎల్లో కల్లోలం

Published Mon, Mar 25 2024 2:10 AM

TDP leaders concerns in more than 30 seats - Sakshi

30కి పైగా స్థానాల్లో భగ్గుమంటున్న టీడీపీ నేతలు

సీట్లు రాక పలుచోట్ల రెబల్స్‌గా మారిన తెలుగు తమ్ముళ్లు

వారిని బుజ్జగించేందుకు శతవిధాలా యత్నిస్తున్న చంద్రబాబు

ఎంత సర్ది చెప్పినా టికెట్‌ దక్కించుకున్నవారిని ఓడిస్తామంటున్న అసంతృప్తులు

పైకి పార్టీ కోసం పనిచేస్తామని చెబుతున్నా లోలోన రగిలిపోతున్న వైనం

పొత్తుల్లో పోయిన 31 స్థానాల్లోనూ గందరగోళమే 

రెడ్డిగూడెంలో బలప్రదర్శన చేపట్టిన టికెట్‌ దక్కని దేవినేని ఉమ

ఏలూరు ఎంపీ టికెట్‌పై రాజీలేని పోరాటం చేస్తున్న బీజేపీ

గోపాలపురంలో మద్దిపాటికి తప్పని అసమ్మతి బెడద

సాక్షి, అమరావతి/రెడ్డిగూడెం/శ్రీకాకుళం/ద్వారకా తిరుమల/ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అసమ్మతితో అట్టుడుకుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మూడు విడతల్లో 138 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటివరకూ 30కి పైగా నియోజకవర్గాల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఆయా నియోజక­వర్గాల్లో సీట్లు దక్కని నేతలు అధినేతపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

వాళ్ల అనుచరులు ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. పలు­చోట్ల అసమ్మతి నాయకులు స్వతంత్రంగా బరిలోకి దూకేందుకు వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. వారిని బుజ్జగించేందుకు చంద్రబాబు వరుసగా సమా­వేశాలు నిర్వహిస్తూ... సీనియర్‌ నేతలను వారి వద్దకు పంపుతూ... కొందరితో రాయబారాలు నడుపుతూ... సర్దిచెప్పేందుకు శత విధాలుగా యత్నిస్తున్నారు. కొందరైతే అధినేతను కలిసేందుకు కూడా ఇష్టపడటంలేదు.

కాదూకూడదని వెళ్లినవారు ఆయన ముందు పార్టీ కోసం పనిచేస్తామని చెబు­తున్నా బయటకు వచ్చాక తమ అసంతృప్తిని వెళ్ల­గక్కు­తూనే ఉన్నారు. ఇవి కాకుండా జనసేన, బీజేపీకి కేటాయించిన 31 స్థానాల్లోనూ అనేక చోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 

అభ్యర్థులను ఓడిస్తాం... మా సత్తా చూపిస్తాం...
టికెట్లు దక్కించుకున్నవారిని ఓడించి తమ సత్తా చూపిస్తామని పలువురు నేతలు బాహాటంగానే సవాల్‌ విసురుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, ఏలూరు జిల్లా నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్‌గా ప్రచారం ప్రారంభించగా... విజయనగరం జిల్లా గజపతినగరంలో కె.అప్పలనాయుడు, విజయనగరంలో మీసాల గీత, కురుపాంలో వైరిచర్ల వీరేశ్‌దేవ్, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో కలమట వెంకటరమణ, తునిలో సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.

చింతలపూడి, తిరువూరు, పెడన, పామర్రు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు పూర్తి స్థాయి మద్దతు దొరకడంలేదు. కొవ్వూరు సీటు తనకు కేటాయించకపోవడంతో మాజీ మంత్రి కె.ఎస్‌.జవహర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమవుతున్నారు. గోపాలపురం సీటును మద్దిపాటి రాజుకు ఇవ్వడాన్ని అంగీకరించని అక్కడి పార్టీ సీనియర్‌ నేతలు ముళ్లపాటి బాపిరాజు తదితరులు తమను కాదని టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరిస్తున్నారు.

దెందులూరు సీటును చింతమనేని ప్రభాకర్‌కు ఇవ్వడం చలుమోలు అశోక్‌గౌడ్, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, మాగంటి రవళితోపాటు అక్కడి పార్టీ సీనియర్‌ నేతలకు సుతరామూ ఇష్టం లేదు. వారంతా చింతమనేనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.

దేవినేనిపైనా పెరుగుతున్న అనుమానాలు
ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కి ఖరారు చేయడంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సహించలేకపోతున్నారు. పార్టీకి కట్టుబడి ఉన్నట్లు పైకి చెబుతున్నా వసంతను ఓడించడమే తన ధ్యేయమని ఆయన అంతర్గతంగా పార్టీ క్యాడర్‌కూ సంకేతాలు ఇస్తున్నారు. అంతేనా... ఆదివారం రాత్రి ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం గ్రామంలో బల ప్రదర్శన నిర్వహించారు. రెండు రోజుల క్రితం జక్కంపూడి వైఎస్సార్‌ కాలనీలోనూ బలప్రదర్శన చేపట్టారు. అంటే ఆయన ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదివారం రాత్రి రెడ్డిగూడెం వచ్చిన దేవినేని ఉమా టీడీపీ మండల పార్టీ కార్యాలయం నుంచి రాఘవాపురంలోని పద్దమ్మ గుడి వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సుమారు 500 మంది పాల్గొన్నారు. టీడీపీ జెండాలు లేకుండానే సాగిన ర్యాలీలో దేవినేని ఉమా నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు టికెట్‌ ఇవ్వడాన్ని కోడెల శివప్రసాద్‌ తనయుడు శివరాం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

నర్సరావుపేటలో కడియాల వెంకటేశ్వరరావు, నల్లపాటి రాము తదితరులు అరవింద్‌బాబు అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడంలేదు. పెదకూరపాడు సీటును పారాచూట్‌ నేత భాష్యం ప్రవీణ్‌కు కేటాయించడంతో అక్కడి ఇన్‌చార్జి కొమ్మాలపాటి శ్రీధర్‌ అలకబూని పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తానని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో బూదాల అజితారావు, మన్నె రవీంద్ర అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. 

అభ్యర్థులకు గడ్డు పరిస్థితి
నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానాన్ని ఎన్‌ఆర్‌ఐ కాకర్ల సురేష్‌కి ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, ఆత్మకూరు సీటును ఫిరాయింపు ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి ఇవ్వడాన్ని కొమ్మి లక్ష్మయ్యనాయుడు, కావలి సీటును బడా కాంట్రాక్టర్‌ కావ్య కృష్ణారెడ్డికి దక్కడాన్ని మాలేపాటి సుబ్బానాయుడు, బీద రవిచంద్ర వ్యతిరేకిస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి గట్టిగా పనిచేస్తోంది.

శ్రీకాళహస్తిలో ఎస్‌.సి.వి.నాయుడు, సత్యవేడులో జె.డి.రాజశేఖర్‌ తమను చంద్రబాబు మోసం చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సీటును అక్కడి పార్టీ సీనియర్‌ నాయకులు ఉమామహేశ్వరనాయుడు, ఉన్నం హనుమంతరాయచౌదరికి  కాకుండా కాంట్రాక్టర్‌ అమిలినేని సురేంద్రబాబుకు ఇవ్వడంతో పార్టీ క్యాడర్‌ అంతా భగ్గుమంటోంది. కదిరిలో అత్తార్‌ చాంద్‌బాషా తనకు సీటు ఇవ్వలేదని తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్దే ఆందోళన చేయించారు. చివరికి బాలకృష్ణకూ అసమ్మతి తప్పలేదు.

కర్నూలు జిల్లా మంత్రాలయంలో తిక్కారెడ్డి, నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, డోన్‌లో ధర్మవరం సుబ్బారెడ్డి, వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో రమేష్‌కుమార్‌రెడ్డి అలుక వీడటం లేదు. తంబళ్లపల్లె, అమలాపురం, గుంటూరు వెస్ట్, కోవూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి నియోజకవర్గాల్లోనూ అసమ్మతి బెడద ఎక్కవగానే ఉంది. 

శ్రీకాకుళం ఆగని ఆందోళనలు
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాల్లో టికెట్‌ రాని టీడీపీ నాయకులు అధిష్టానంపై దుమ్మెత్తిపోతున్నారు. శ్రీకాకుళంలో సమావేశం నిర్వహించిన గుండ లక్ష్మీదేవి, అప్పలసూర్యనారాయణ దంపతులు అచ్చెన్నకు తమపై ఎందుకంత కక్ష అని సూటిగా ప్రశ్నించారు. అధిష్టానం తీరు మారకుంటే స్వతంత్రంగా పోటీ చేస్తామని చెప్పారు.

అలాగే కొత్తూరు మండలం నివగాం వద్ద అనుచరులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ రాష్ట్ర, జిల్లా పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లపై పరోక్షంగా విమర్శలు చేశారు. సైట్లు ఇస్తామని చెప్పి కొన్ని వేలమంది నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిన ఒక 420 అయిన మామిడి గోవిందరావుకు ఎమ్మెల్యేగా గెలిపించమంటే ఒప్పుకునేది లేదన్నారు.   

మద్దిపాటిపై సీనియర్ల మండిపాటు
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం స్థానాన్ని గ్రాఫ్‌ పడిపోయిన మద్దిపాటికి కేటాయించడంపై అక్కడి సీనియర్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లజర్లలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో నాలుగు రోజుల క్రితం నియోజకవర్గంలోని అసమ్మతి నాయకులు సమావేశమై మద్దిపాటి తప్ప వేరెవ్వరైనా తమకు ఓకే అని తేల్చిచెప్పారు. గ్రాఫ్‌ పడిపోయిన వ్యక్తిని గెలిపించమంటే తమ వల్ల కాదని వారు చేతులెత్తేశారు.

ఇక్కడ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా తానేటి వనితను ప్రకటించారనీ, ఆమెను ఢీకొనాలంటే గట్టి క్యాండిడేట్‌ అవసరమని తెలిపారు. దీనిపై పునరాలోచన చేయాలని కోరారు. ఇదే సందర్భంలో మద్దిపాటి వెంకట్రాజు నాలుగు రోజులుగా చేపట్టిన పాదయాత్రకు ఒక వర్గం నాయకులు, కార్యకర్తలు దూరంగానే ఉన్నారు. 

ఏలూరు ఎంపీ సీటుపై వెనక్కి తగ్గని బీజేపీ
ఏలూరు పార్లమెంటు సీటు స్థానిక నేత గారపాటి చౌదరికే ఇవ్వాలని జిల్లా బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆదివారం చేరుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కడప నాయకుడికి అక్కడ సీటు కేటాయించడం సరికాదని వారు పట్టుపడుతున్నారు.

రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చౌటపల్లి విక్రమ్‌ కిశోర్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు బి.నిర్మలా కిశోర్, ఏలూరు పార్లమెంట్‌ కన్వీనర్‌ కె.కృష్ణప్రసాద్, వివిధ అసెంబ్లీ కన్వీనర్లు శరణాల మాలతీరాణి, నడపన దాన భాస్కరరావు, నగరపాటి సత్యనారాయణ, గుమ్మడి చైతన్య, యేసు వరప్రసాద్, గాది రాంబాబు, రామకృష్ణ తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement