లోకేష్‌.. ఏమిటీ వ్యాఖ్యలు.. విస్తుపోతున్న టీడీపీ నేతలు

13 Aug, 2021 07:51 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో నిరుద్యోగం గురించి నెల్లూరులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ అందరూ నవ్వుకునేలా వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఒక యువకుడికి పదేళ్లుగా ఉద్యోగం రాలేదంటూ.. రెండేళ్ల కిందట అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించడం చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఈ పదేళ్లలో ఐదేళ్లు అధికారంలో ఉంది మనమేగా.. అంటూ తెలుగుదేశం నాయకులే విస్తుపోయారు. ఏదో అనుకుంటే ఇలా అయిందేమిటంటూ వారు చర్చించుకోవడం కనిపించింది. యువజనోత్సవంలో పాల్గొనేందుకు లోకేష్‌ గురువారం నెల్లూరు వచ్చారు. స్థానిక చుండూరివారివీధిలో ఈనెల 1న కమల్‌ (34) ఆత్మహత్య చేసుకున్నాడు.

పదేళ్ల కిందట ఎంబీఏ పూర్తిచేసిన కమల్‌ ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కమల్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన లోకేష్‌ ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో వెనుదిరిగారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. 300 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పదేళ్లుగా అనేక ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాకపోవడంతో నెల్లూరులో కమల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి సొంత జిల్లాలో పరిస్థితి ఇంత దారుణంగా ఉందని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులుంటే ఒక్క కంపెనీ తెచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ప్రజల్ని గాలికొదిలేశారని విమర్శించారు.

ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించకపోతే.. చంద్రబాబునాయుడు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇస్తుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగులకిచ్చిన రూ.2 వేల నిరుద్యోగ భృతిని తక్షణమే ఇవ్వాలని కోరారు. ఇదంతా విన్నవారు.. పదేళ్లుగా ప్రయత్నించినా ఉద్యోగం రాలేదంటే అందులో ఐదేళ్లు తెలుగుదేశమే అధికారంలో ఉండటం, అందులోను తాను మంత్రిగా పనిచేసిన విషయం లోకేష్‌కు గుర్తులేదా అని విమర్శిస్తున్నారు.  

మరిన్ని వార్తలు