టీడీపీ తొలి జాబితా ఎఫెక్ట్‌.. చంద్రబాబుకు కొత్త టెన్షన్‌! | Sakshi
Sakshi News home page

టీడీపీ తొలి జాబితా ఎఫెక్ట్‌.. రాజీనామాకు రెడీ అంటున్న నేతలు!

Published Sat, Feb 24 2024 1:03 PM

TDP Leaders Dissatisfaction Over Candidates 1st List - Sakshi

సాక్షి, వైఎస్సార్‌/అనంతపురం: ఏపీలో టీడీపీ-జనసేన కూటమిలో భాగంగా నేడు తొలి జాబితా విడుదలైంది. ఇక, ఏపీలో 175 స్థానాలకు గాను 24 స్థానాలను, మూడు పార్లమెంట్‌ స్థానాలను జనసేనకు కేటాయించారు. మరోవైపు.. తొలి జాబితాలో టీడీపీ 94 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. 

అయితే, తొలి జాబితాలో సీట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు బయటకు వస్తున్నాయి. టీడీపీకి ఎప్పటి నుంచో సేవ చేస్తున్న కొందరు నేతలకు తొలి జాబితాలో చోటు దక్కకపోవడంతో పలుచోట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

వైఎస్సార్‌ జిల్లాలో ఇలా.. 
►ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కడప టీడీపీ అభ్యర్దిగా మాధవి రెడ్డికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఇక్కడ, టికెట్‌ ఆశించి అమీర్ బాబు, ఉమాదేవి భంగపాటుకు గురయ్యారు. కాగా, గత కొంత కాలంగా మాధవి రెడ్డి వర్గంతో వీరిద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉంటున్నారు. ఈ క్రమంలో టికెట్‌ దక్కకపోవడంతో మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. 

►ఇక, రాయచోటి టికెట్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి దక్కింది. ఇక్కడ టికెట్ ఆశించి మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి, ద్వారకనాథరెడ్డి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో రమేష్‌ రెడ్డి రాజీనామాకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. ఆయన అనుచరులు ఇప్పటికే రాజీనామాలు ప్రకటించినట్టు సమాచారం. మరోవైపు.. మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి కూడా హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తొలి జాబితాలో టికెట్‌ ప్రకటించని నియోజకవర్గాల్లో టెన్షన్‌ వాతావరణం కనిపిస్తోంది. 

►కమలాపురంలో ఇన్‌చార్జ్‌ పుత్తా నరసింహారెడ్డి టికెట్‌ ఆశిస్తుండగా.. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆయనకు పోటీనిస్తున్నారు. వీరశివారెడ్డి అడ్డుపడటం వల్లే కమలాపురం స్థానంలో ప్రకటన ఆగిందనే చర్చ నడుస్తోంది. అటు జమ్మలమడుగు నుంచి భూపేష్‌ రెడ్డి టికెట్‌ ఆశిస్తున్నారు. అక్కడ బీజేపీ నుంచి మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి బరిలో నిలుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగా జమ్మలమడుగుపై ప్రకటన ఆగిపోయినట్టు సమాచారం. అటు, రైల్వేకోడూరులో టీడీపీ వర్సెస్‌ జనసేన అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది.  

అనంతపురంలో ఇలా.. 
►పెనుకొండలో మాజీ ఎమ్మెల్యే, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథికి చంద్రబాబు హాండ్యిచ్చారు. పెనుకొండ టీడీపీ అభ్యర్థిగా సబిత ఎంపికపై బీకే వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 

►శింగనమల టీడీపీ అభ్యర్థిగా బండారు శ్రావణి నియామకంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండారు శ్రావణి నియామకాన్ని వ్యతిరేకిస్తున్న టూమెన్ కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసానాయుడు అసంతృప్తిగా ఉన్నారు.

►కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్ర బాబు నియామకంపై స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. ఇక్కడ టిక్కెట్ ఆశించి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు భంగపడ్డారు. దీంతో, కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రకు ఎన్నికల్లో సహకరించేది లేదని ఉన్నం, ఉమ వర్గీయులు తేల్చి చెబుతున్నారు. 

టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ఇదే..

Advertisement
Advertisement