Guntakal: గుమ్మనూరుకి బొమ్మ చూపిస్తాం..! | Sakshi
Sakshi News home page

Guntakal: గుమ్మనూరు జయరామ్‌కి బొమ్మ చూపిస్తాం..!

Published Mon, Apr 1 2024 6:51 AM

TDP Leaders unsatisfied To Gummanur Jayaram - Sakshi

ఇంకా గుంతకల్లు వైపు చూడని గుమ్మనూరు జయరామ్‌

అడుగడుగునా రగులుతున్న అసమ్మతి జ్వాలలు

బొమ్మ చూపిస్తామని బహిరంగంగానే హెచ్చరించిన తెలుగు తమ్ముళ్లు

చుక్కలు చూపుతామని సొంత పార్టీ నేతలే హెచ్చరించారు. రకరకాలుగా ప్రలోభాలకు గురిచేసినా లొంగనంటున్నారు. తన మనస్తత్వం తెలిసిన ప్రజలు కూడా బహిరంగంగానే బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్‌ కేటాయించిన నియోజకవర్గంలో అడుగు పెట్టకముందే గుమ్మనూరు జయరామ్‌కు అసమ్మతి స్వాగతం పలుకుతోంది.

గుంతకల్లు: ఎడతెగని చర్చలు, అనేక సమాలోచనల అనంతరం గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ టికెట్‌ దక్కించుకున్న గుమ్మనూరు జయరామ్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. సీనియారిటీ, పార్టీ విధేయతను పక్కన పెట్టి జయరామ్‌కు సీటు కట్టబెట్టడాన్ని తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోతున్నారు. పార్టీ టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే ఆర్‌.జితేంద్రగౌడ్‌తోపాటు వారి కుటుంబసభ్యులు, వర్గీయులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. జయరామ్‌ను ఓడిస్తామని ఇప్పటికే బాహాటంగానే ప్రకటించారు. జయరామ్‌ విషయంలో తమ అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తపరిచినా చంద్రబాబు ఆయన వైపే మొగ్గు చూపడంపై జితేంద్రగౌడ్‌ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. అయితే, చంద్రబాబుపై గౌరవంతో ఆయన నిర్ణయానికి తలవంచి సర్దుకుపోతాడా లేదా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

దారికి రాని కేడర్‌..
మరోవైపు గుమ్మనూరు జయరామ్‌ శిబిరంలో ఉన్న కొందరు తెలుగుదేశం నాయకులు, ఆయన కుటుంబసభ్యులు కొన్ని రోజులుగా స్థానిక తెలుగు తమ్ముళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. రకరకాల తాయిలాలతో కేడర్‌ను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిన్నటిదాకా గుమ్మనూరు అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపిన తాము, ఆయన కోసం ఎలా పని చేస్తామని తెలుగుతమ్ముళ్లు చాలాచోట్ల తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది.

ప్రజల్లోనూ భయం..
గుమ్మనూరు జయరామ్‌ అభ్యర్థిత్వం పట్ల స్థానిక ప్రజలు కూడా అసహనంగా ఉన్నారు. రౌడీయిజం, మాఫియాకు మారుపేరుగా చెప్పుకునే గుమ్మనూరు జయరామ్‌, ఆయన అనుచరులు.. ప్రశాంతమైన గుంతకల్లు నియోజకవర్గంలో ఎక్కడ అలజడులు రేపుతారోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గుమ్మనూరు జయరామ్‌ చరిత్ర తెలిసిన వారైతే మరింతగా హడలిపోతున్నారు. జయరామ్‌ పేకాట మాఫియా, భూ కబ్జాలు, ఆయన అనుచరుల ఆగడాలను తలుచుకుంటూ భయకంపితులవుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు తమ్ముళ్లతో పాటు ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, కురుబ, యాదవ తదితర అనేక సామాజిక వర్గ నాయకులతో పాటు పట్టణ వ్యాపారులు ఏకంగా విలేకరుల సమావేశాలు పెట్టి జయరామ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకరించారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.

గెలుపు ఎట్లా..?
గుంతకల్లు నియోజకవర్గంలో అడుగుపెట్టకముందే సొంత కార్యకర్తలు, ప్రజల్లో జయరామ్‌ పూర్తి వ్యతిరేకత మూట కట్టుకున్నారు. ఒకవేళ అడుగుపెట్టినా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలను తన వైపు తిప్పుకోవడం, జితేంద్రగౌడ్‌ వర్గం సహకారం పొందడం, జనంలోకి వెళ్లడం కత్తిమీద సాములా మారనుంది. ఇదే ఇప్పుడు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నా జయరామ్‌కే చంద్రబాబు టికెట్‌ కేటాయించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రూ. కోట్లు చేతులు మారడంతోనే బాబు ఆయన వైపు మొగ్గు చూపారని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement