ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..! | Sakshi
Sakshi News home page

ఏ ముహూర్తాన పార్టీ లేదు.. బొక్కా లేదు అన్నాడో కానీ.. నిజంగానే..!

Published Wed, Jan 18 2023 9:37 AM

TDP situation is getting worse day by day in Sri Sathyasai District - Sakshi

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతోంది. అర్హతే ప్రామాణికంగా ఫలాలు ఇంటి ముందు వచ్చివాలుతున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు వంటి విప్లవాత్మక కార్యక్రమాలతో గ్రామాల స్వరూపమే మారిపోతోంది. దీంతో అన్ని వర్గాల ప్రజలు వైఎస్సార్‌ సీపీ సర్కారుతో కనెక్ట్‌ అయిపోయారు. ప్రతిపక్షాల ఊసే మర్చిపోతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందే జిల్లాలో టీడీపీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైన టీడీపీ అధినేత   చంద్రబాబుకూ ఈ విషయం బోధపడినట్లు తెలిసింది. ఇప్పటికే పలువురు నాయకులతో సమావేశమై బుజ్జగింపు పర్వాలు మొదలుపెట్టినా.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు సమాచారం.  

సాక్షి, పుట్టపర్తి: ఏ ముహూర్తాన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ లేదు.. బొక్కా లేదు అని అన్నాడో తెలియదు కానీ నిజంగానే ఆ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటోంది. కుదేలైన సైకిల్‌కు ఎన్ని మరమ్మతులు చేసినా ప్రయోజనం కానరావడం లేదు. జిల్లా టీడీపీలో అసమ్మతి మంటలు రగులుతూనే ఉన్నాయి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఆ పార్టీ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. కేవలం ఉనికి కాపాడుకునేందుకు నేతలు యత్నిస్తున్నారు. పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. అయితే పరిస్థితి చేయి దాటిపోయిందని.. ఇప్పుడేం చేయలేమని ‘తమ్ముళ్లు’ సమాధానం ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  

టికెట్‌ రాని పక్షంలో అధిష్టానంతో అమీ తుమీ తేల్చుకుంటామని కొందరు నేతలు ఇప్పటికే సిద్ధమయ్యారు. పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడు, హిందూపురం, కదిరి నుంచి టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. ‘పోటీ చేసేది నేనే’ అంటూ ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పెనుకొండ నుంచి బీకే పార్థసారథి, పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం నుంచి బాలకృష్ణ, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్, రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తున్నట్లు ఎవరికి వారు చెప్పుకొంటున్నారు. కానీ ఇందులో ఏ ఒక్కరికి కూడా టికెట్‌ గ్యారెంటీ లేదు. ప్రతి నియోజకవర్గంలో అసమ్మతి నేతల బెడద వెంటాడుతోంది. 

పెనుకొండలో సవితమ్మ, నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి టికెట్‌ రేసులో ఉన్నారు. పుట్టపర్తి నుంచి పల్లె రఘునాథరెడ్డి, సైకం శ్రీనివాసరెడ్డి, కదిరి నుంచి అత్తార్‌ చాంద్‌బాషా, కందికుంట వెంకట ప్రసాద్, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్‌తో పాటు బీజేపీ నేత వరదాపురం సూరి, పొత్తు కుదిరితే జనసేన నుంచి చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా పోటీలో ఉండనున్నట్లు తెలిసింది. రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీ చేస్తారా? లేక తనయుడిని బరిలో దింపుతారా? అనేది తెలీదు. ధర్మవరం టికెట్‌ రాకుంటే రాజీనామా చేస్తానని పరిటాల శ్రీరామ్‌ సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సీనియర్‌ వర్సెస్‌ జూనియర్స్‌ చందంగా టీడీపీ నేతల మధ్య కోల్డ్‌ వార్‌ తారస్థాయికి  చేరింది. ఒకరితో ఒకరి పోరుతో జిల్లాలో చాలా మంది కీలక టీడీపీ నేతల రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కొందరు కనుమరుగు కాగా.. మరికొందరు అదేబాటలో నడుస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా.. నేతల వేరుకుంపట్లతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా తలోబాట పట్టినట్లు తెలుస్తోంది.  

Advertisement
Advertisement