కుప్పంలో ఎన్నికల కోడ్‌కు టీడీపీ తూట్లు | TDP Touts Election Code In Kuppam Ahead Of Assembly Elections In AP, Details Inside - Sakshi
Sakshi News home page

కుప్పంలో ఎన్నికల కోడ్‌కు టీడీపీ తూట్లు

Published Fri, Apr 5 2024 5:18 AM

TDP touts election code in kuppam - Sakshi

పింఛనుదారులపై ప్రేమను నటిస్తూ ఎన్నికల ప్రచారం

ఆటోల్లో తరలిస్తూ ఓటు వేయాలని అభ్యర్థన

సచివాలయాల వద్ద మజ్జిగ ఇస్తూ కరపత్రాల పంపిణీ

కుప్పంరూరల్‌ (చిత్తూరు జిల్లా): కుప్పంలో టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేసి పింఛనుదారులను రోడ్డుపాలు చేసిన టీడీపీ నేతలు... మరోవైపు పింఛనుదారులపై ప్రేమను నటిస్తున్నారు. పింఛనుదారులను ఆటోల్లో సచివాలయాలకు తీసుకువెళుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సచివాలయాల్లో వృద్ధులకు మజ్జిగ పంపిణీ చేస్తూ టీడీపీ కరపత్రాలను అందజేస్తున్నారు.

కుప్పం మండల పరిధిలో సామాజిక పింఛన్ల పంపిణీ గురువారం ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ మండల, పంచాయతీ స్థాయి నాయకులు తమ గ్రామాల పరిధిలోని లబ్ధిదారులను ఆటోల్లో సచివాలయాలకు తరలించి, వారికి మజ్జిగ, ఇతర చల్లని పానీయాలు అందజేశారు.

మరికొంతమంది సచివాలయాల ముందు మజ్జిగ ప్యాకెట్లతో తిష్టవేసి లబ్ధిదారులకు పంచిపెట్టారు. లబ్ధిదారులు తిరిగి వెళ్లే సమయంలో ‘ఈ పరిస్థితికి సీఎం వైఎస్‌ జగణ్‌ కారణం. టీడీపీకి ఓటు వేస్తే ఒకటో తేదీ ఉదయమే మీ ఇంటి వద్దకు వచ్చి రూ.4వేలు పింఛను ఇచ్చే కార్యక్రమం చేపడతాం’ అని టీడీపీ నేతలు చెబుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. 

కోడ్‌ ఉల్లంఘనపై ప్రశ్నిస్తే గొడవకు..
కుప్పం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్న టీడీపీ నాయకులను వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నిస్తే గొడవకు దిగారు. దాసేగౌనూరు గ్రామంలో టీడీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పెన్షనర్లను ఆటోల్లో తీసుకువెళుతూ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతుండగా, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు మురుగేష్, మరికొందరు అడ్డుకున్నారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఇలా లబ్ధిదారులను తీసుకువచ్చి ప్రచారం ఎలా చేస్తున్నారని ప్రశ్నించారు. వెండుగంపల్లి సచివాలయం వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టీడీపీ శ్రేణులను వైఎస్సార్‌సీపీకి చెందిన సర్పంచ్‌ ధర్మ, టౌన్‌ బ్యాంకు చైర్మన్‌ భాగ్యరాజ్‌ ప్రశ్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ములకలపల్లి సచివాలయంలో స్థానిక టీడీపీ నాయకుడు మురళి ఏకంగా సచివాలయం లోపలికే వెళ్లి లబ్ధిదారులకు మజ్జిగ, కూల్‌డ్రింక్‌లు పంపిణీ చేశారు.  

Advertisement
Advertisement