టీఆర్‌ఎస్‌ డబ్బులు తీసుకుని బీజేపీకి ఓటేయండి 

22 Oct, 2021 04:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవా లని టీఆర్‌ఎస్‌ పార్టీ డబ్బులు పంచుతోందని, ఆ డబ్బులు తీసుకొని కమలానికి ఓటేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. గురువారం హుజూరాబాద్‌లోని సింగాపూర్, తుమ్మనపల్లి, కందుగుల గ్రామాల్లో జరిగిన రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు. వంద కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేయించిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకి దక్కిందన్నారు.

సీఎం కేసీఆర్‌ మాత్రం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకుండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు.  బీజేపీ దేశ ఆస్తులమ్ముకుంటోందని ఆరోపించే టీఆర్‌ఎస్, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి అప్పులపాలు జేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధికి వెచ్చించే నిధులన్నీ కేంద్రానివేనన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులు, రైతులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. దళితబంధు పథకాన్ని బీజేపీ వాళ్లు ఆపారని టీఆర్‌ఎస్‌ అసత్యాలను ప్రచారం చేస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ పొగరు అణచాలంటే బీజేపీని గెలపించాలని బండి సంజయ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తలు