పార్టీ ఆఫీసు కోసం రూ.150 కోట్ల స్థలమా?  | Sakshi
Sakshi News home page

పార్టీ ఆఫీసు కోసం రూ.150 కోట్ల స్థలమా? 

Published Fri, May 13 2022 2:48 AM

Telangana BJP Chief Bandi Sanjay Comments On CM KCR - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: పేదలకు ఇళ్లు ఇవ్వని కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు కోసం రూ.150 కోట్ల విలువైన స్థలం అప్పనంగా తీసుకోవడంపై బీజేపీ అధ్యక్షుడు బండి సం జయ్‌ మండిపడ్డారు.  గురువారం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం మురళీనగర్‌ నుంచి చిప్పలపల్లి, దన్నారం, పులిమామిడి, దావూద్‌గూడ తండా మీదుగా మహేశ్వరం మండలం ఎన్డీతండా వరకు సంజయ్‌ ‘ప్రజాసంగ్రామ యాత్ర’కొనసాగింది.

చిప్పలపల్లి, పులిమామిడి గ్రామాల్లో నిర్వహించిన ‘రచ్చబండ’కు ఆయా గ్రామాలకు చెందిన మహిళలు, నిరుద్యోగులు, కూలీలు వచ్చి సమస్యల్ని విన్నవించారు. సంజయ్‌ మాట్లాడుతూ ప్రజలకు చెందాల్సిన 4,935 గజాల భూమిని పార్టీ ఆఫీసుకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఆ భూమి అమ్మితే వచ్చే డబ్బుతో పేదలకు ఇళ్లు , పెన్షన్లు ఇవ్వొచ్చన్నారు.

జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కేంద్రం విధిగా చెల్లిస్తుండగా, వాటిని సకాలంలో కూలీలకు చెల్లించకుండా కేసీఆర్‌ ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. కూలీ డబ్బులు ఇవ్వనివారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తాము ఓట్ల కోసమో.. ఎన్నికల కోసమే ఇక్కడికి రాలేదని, పేదల కష్టాలను తెలుసుకునేందుకే మోదీ ఆదేశాలతో వచ్చామని స్పష్టం చేశారు. ‘ప్రజాసమస్యలపై కేసీఆర్‌ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు, పేదల కోసం కొట్లాడుతున్నందుకు నన్ను జైలుకు పంపారు. పేదలకు న్యాయం చేయడానికి జైలుకే కాదు, ఎక్కడికైనా వెళ్లడానికి నేను సిద్ధమే’ అని అన్నారు. 

 బైక్‌ ఉందనే సాకు చూపి.. 
‘సార్‌.. మాకు బైక్‌ ఉందనే సాకు చూపి రేషన్‌కార్డు తొలగించారు’అని చిప్పలపల్లికి చెందిన వార్డుసభ్యురాలు రమాదేవి ఆవేదన వ్యక్తం చేయగా, ‘మేం భర్తలను కోల్పో యాం. వృద్ధాప్యంతో బాధపడుతున్నాం. వితంతు, వృద్ధాప్య పింఛన్లు రావడం లేదు. ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా ఎవరూ పట్టించుకుంటలేరు’అని అదే గ్రామానికి చెందిన యాదమ్మ, కమలమ్మ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ముందు గోడు వెల్లబోసుకున్నారు.  

Advertisement
Advertisement