టీఆర్‌ఎస్‌ వ్యూహాలను తక్కువగా అంచనా వేశాం! | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ వ్యూహాలను తక్కువగా అంచనా వేశాం!

Published Mon, Nov 7 2022 1:23 AM

Telangana: BJP Disappointment TRS Victory In Munugode Bypoll - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడాన్ని ఆ పార్టీ నేతలు లోతుగా విశ్లేషించుకుంటున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపు ఆద్యంతం (2, 3 రౌండ్‌లలో మినహా) టీఆర్‌ఎస్‌ మెజారిటీ కొనసాగడం బీజేపీ నేతలను నిరాశకు గురిచేసింది. గట్టిగా ప్రయత్నించినా తమ అభ్యర్ధి విజయం సాధించకపోవడం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయనివారు చెప్తున్నారు.

దుబ్బా­­క, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో సాధించిన విజయంతో మునుగోడులో కొంత అతి విశ్వాసంతో వ్యవహరించడం.. అధికార టీఆర్‌ఎస్, సీఎం కేసీఆ­ర్‌ల వ్యూహాలు, ప్రయత్నాలను తక్కువగా అంచనా వేయడం.. పార్టీ అవకాశాలను దెబ్బతీశాయని అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై, అభ్యర్థిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో బీజేపీ సులువుగా గెలుస్తుందన్న అంచనాలు తలకిందులు అయ్యాయని అంటున్నారు.

టీఆర్‌ఎస్‌ ముందస్తుగా సిద్ధమవడంతో..
మునుగోడుకు సంబంధించి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటికే టీఆర్‌ఎస్‌ ఎన్నికల సన్నాహాలు చేపట్టిందని, దీన్ని బీజేపీ పసిగట్టలేకపోయిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నియోజకవర్గ స్థాయిలో చేస్తున్న కసరత్తు, సంసిద్ధతకు ప్రచారం కల్పించకుండా.. టీఆర్‌ఎస్‌ నిర్వహించిన అండర్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌ను గ్రహించలేకపోయామని.. దీనితో తగినట్టుగా ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకోలేక­పోవడం తమ అవకాశాలను దెబ్బతీసిందని అంచనా వేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ మునుగోడులో పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించిందని.. మండలాలు, మున్సిపాలిటీల వారీగా కిందిస్థాయిలో ప్రతి వంద మంది ఓటర్ల వరకు పర్యవేక్షణ బృందాలను నియమించుకుని పట్టుసాధించిందని భావిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా నాటి నుంచి పోలింగ్‌ ముగిసేదాకా టీఆర్‌ఎస్‌ నేతలు చాపకింద నీరులా పనిచేయడంతో పరిస్థితి అధికార పార్టీకి అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. రాజగోపాల్‌రెడ్డి వెంట స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలంతా బీజేపీలోకి రాకపోవడం కూడా దెబ్బతినడానికి కారణమైందని.. అలాంటి కాంగ్రెస్‌ కేడర్‌ను టీఆర్‌ఎస్‌ పకడ్బందీగా తమవైపు తిప్పుకొందని స్పష్టం చేస్తున్నారు.

అధికార యంత్రాంగం అండదండలతో..!
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కారణంగా అధికార, పోలీసు యంత్రాంగం అనుకూలంగా పనిచేయడం టీఆర్‌ఎస్‌కు కలిసి వచ్చిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ బీజేపీకి, కేంద్రమంత్రి, ఇతర ముఖ్యనేతల ప్రకటనలకు ప్రభుత్వ యంత్రాంగం ఆటంకాలు సృష్టించిందని.. చివరికి రాళ్లదా­డులు, అడ్డుకోవడాలు వంటి చర్యల్లోనూ బీజేపీకి ప్రతికూలంగా వ్యవహరించిందని విమర్శి­స్తున్నారు.

బీజేపీకి సంబంధమున్న వారి నుంచి పెద్దమొత్తంలో డబ్బును స్వాధీనం చేసుకోవడం, దాన్ని మీడియాకు లీకులివ్వడం ద్వారా.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగిందని అంటున్నారు. ఇక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నించిందనే ఆరోపణలు కూడా కొంతమేర ప్రతికూల ప్రభావం చూపినట్టు అంచనా వేస్తున్నారు.  

Advertisement
Advertisement