లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించండి  | Telangana BJP Focus On Lok Sabha Elections 2024, Political Strategies Details Inside - Sakshi
Sakshi News home page

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారించండి

Published Wed, Jan 17 2024 6:15 AM

Telangana BJP Focus on Lok Sabha Elections 2024 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పనిచేయాలని రాష్ట్రాల బీజేపీ ప్రధాన కార్యదర్శులు, జాతీయ ప్రధాన కార్యదర్శులకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సూచించారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గత తొమ్మిదిన్నరేళ్లుగా ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం సుమారు 5 గంటలపాటు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అమిత్‌ షా, జేపీ నడ్డాలు మార్గదర్శనం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శులు బండి సంజయ్‌ కుమార్, తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బన్సల్‌లతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన చంద్రశేఖర్, ప్రేమేందర్‌ రెడ్డి, బంగారు శ్రుతి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్, కాసం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై సునీల్‌ బన్సల్, చంద్రశేఖర్‌లు రాష్ట్ర నాయకులతో ప్రత్యేకంగా చర్చించారు. అంతేగాక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని సూచించారు. 

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ 
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్తాన్‌లో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్‌ 2017 సెపె్టంబర్‌ నుంచి పనిచేస్తున్నారు. ఆర్‌ఎస్‌ ఎస్‌ నేపథ్యం ఉన్న చంద్రశేఖర్‌ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. 2017లో రాజస్తాన్‌ బాధ్యతలు తీసుకొనే ముందు చంద్రశేఖర్‌ పశి్చమ ఉత్తరప్రదేశ్, అంతకు ముందు వారణాశి ప్రాంతీయ సంస్థమంత్రిగా పనిచేశారు. అంతేగాక 2014లో చంద్రశేఖర్‌ ప్రధాని మోదీతో కలిసి వారణాశి లోక్‌సభ స్థానం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు.

నెలాఖరులో రాష్ట్రానికి అమిత్‌షా ? 
వచ్చేనెలలో ఐదు క్లస్టర్లలో బీజేపీ యాత్రలు 
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెలాఖరులో కేంద్రమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటన ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎంపీ సీట్లను 143 క్లస్టర్లుగా బీజేపీ ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణకు వచ్చేసరికి ఐదు క్లస్టర్లుగా విభజించారు. వీటికి నలుగురు రాష్ట్రప్రధానకార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ఇంకా సీనియర్‌నేత, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఇన్‌చార్జ్‌లుగావ్యవహరిస్తారని సమాచారం.

మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీసంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌.సంతోష్‌ సమావేశమయ్యారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా వచ్చేనెలలో తెలంగాణలో 10 రోజులపాటు బీజేపీ యాత్రలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఐదు పార్లమెంట్‌ క్లస్టర్ల వారీగా ఈ యాత్రలు ఉంటాయి. ఇందులో భాగంగా తెలంగాణ అప్పులు తీరాలన్న, తెలంగాణ అభివృద్ధి చెందాలన్న మరోసారి మోదీ అధికారంలోకి రావాలన్న అంశం విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement