కుటుంబపాలనకు చరమగీతం పాడాలి 

20 Aug, 2022 00:42 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: మునుగోడు ఉపఎన్నిక ద్వారా రాష్ట్రంలో కుటుంబపాలనకు చరమగీతం పాడాలని బీజేపీ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రజలను కోరారు. శుక్రవారం వరంగల్‌ వెళ్తూ మార్గమధ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలం గూడూరులోని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు.

మునుగోడు ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మార్చబోతోందన్నారు. తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించడానికే ఈ నెల 21 మునుగోడులో అమిత్‌షా బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఒక్క సంవత్సరం ఓపిక పడితే రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని పారదోలి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ముంచి సీఎం కేసీఆర్‌ చేసిన పాపాలను గోదావరి మాతా వెలుగులోకి తెచ్చిందన్నారు.  కాగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ను ఆ పార్టీ సీనియర్‌ నేత గూడూరు నారాయణరెడ్డి సన్మానించారు.   

మరిన్ని వార్తలు