మెంబర్‌‘షిప్‌’తో ముందుకు.. | Sakshi
Sakshi News home page

మెంబర్‌‘షిప్‌’తో ముందుకు..

Published Mon, Dec 13 2021 2:56 AM

Telangana: Revanth Reddy To Tour LS Constituencies - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ద్విముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువగా కాంగ్రెస్‌ సభ్యత్వాలను చేయించాలనే పట్టుదలతో ఉన్న ఆయన.. పార్టీ సభ్యత్వంతో పాటు కేడర్‌లో పూర్తి స్థాయి కదలిక లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. రోజుకు రెండు లోక్‌సభ నియోజకవర్గాల చొప్పున జనవరి 26 లోపు 9 రోజుల పాటు రేవంత్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు.

స్వయంగా సభ్యత్వ నమోదు పరిశీలన చేపట్టడంతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమావేశాలకు హాజరు కానున్నారు. కార్యకర్తలతో జరిపే భేటీల్లో డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేయడంతో పాటు క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తల నుంచి సమాచారం సేకరించి ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై వారి నుంచి అభిప్రాయ సేకరణ జరుపుతారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత పరిణామాలు, పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు ప్రభావం, వరి పంటపై ఆంక్షలు, దళిత బంధు ప్రభావం తదితర ముఖ్యమైన అంశాలపై కేడర్‌తో మాట్లాడాలని రేవంత్‌ భావిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్న చోట్ల చాలా ఆరోపణలు వస్తున్నాయని చెబుతూ.. ముఖ్యంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టి పనిచేయాలని, వారు చేస్తున్న అవినీతిని ప్రజల్లో ఎండగట్టే కార్యక్రమాలు ఇప్పటినుంచే చేపట్టాల్సిందిగా సూచించనున్నట్టు సమాచారం.  

పార్లమెంటు ఇన్‌చార్జుల నియామకం 
సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమన్వయం చేసేందుకు టీపీసీసీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జులను నియమించింది. టి. కుమార్‌రావు (ఆదిలాబాద్‌), జి. నిరంజన్‌ (పెద్దపల్లి), ఎస్‌. రాజయ్య (కరీంనగర్‌), గాలి అనిల్‌కుమార్‌ (నిజామాబాద్‌), రమేశ్‌ ముదిరాజ్‌ (జహీరాబాద్‌), రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (మెదక్‌), మల్లురవి (మల్కాజ్‌గిరి), రాములు నాయక్‌ (సికింద్రాబాద్‌), ఒబేదుల్లా కొత్వాల్‌ (హైదరాబాద్‌), వేం నరేందర్‌రెడ్డి (చేవెళ్ల), టి. జంగయ్య యాదవ్‌ (మహబూబ్‌నగర్‌), చామల కిరణ్‌కుమార్‌రెడ్డి (నాగర్‌కర్నూల్‌), ఎం.ఆర్‌.జి.వినోద్‌రెడ్డి (నల్లగొండ), పటేల్‌ రమేశ్‌రెడ్డి (భువనగిరి), సంభాని చంద్రశేఖర్‌ (వరంగల్‌), పోట్ల నాగేశ్వరరావు (మహబూబాబాద్‌), సురేశ్‌ షెట్కార్‌ (ఖమ్మం)లకు బాధ్యతలు అప్పగించారు.

దీంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సమన్వయకర్తలను కూడా నియమిస్తూ రేవంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు స్థాయిల్లోని ఇన్‌చార్జులతో పాటు ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల, బ్లాక్, టౌన్, సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుల సమన్వయంతో వచ్చే నెల 26వ తేదీ వరకు సభ్యత్వ నమోదును పూర్తి చేయనున్నారు. మొత్తం 30 లక్షల సభ్యత్వ నమోదు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

Advertisement
Advertisement