29న ‘తెలంగాణ విజయగర్జన’

2 Nov, 2021 01:50 IST|Sakshi

దీక్షా దివస్‌ రోజు వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ 

తొలుత ఈ నెల 15న నిర్వహించేందుకు సన్నాహాలు 

పార్టీ నేతల వినతితో వాయిదా వేసిన అధినేత కేసీఆర్‌ 

తేదీ మార్పునకు అనుగుణంగా సన్నాహాలు చేసుకోవాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ద్విదశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 15న వరంగల్‌లో నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ విజయగర్జన’బహిరంగసభ వాయిదా పడింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రకటించారు. బహిరంగసభను ఈ నెల 29న దీక్షాదివస్‌ సందర్భంగా వరంగల్‌లోనే నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. విజయగర్జన సభ తేదీ మార్పునకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకునేలా క్షేత్రస్థాయి పార్టీ యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

బహిరంగ సభాస్థలి కోసం అన్వేషణ సాగిస్తున్న వరంగల్‌ జిల్లా నేతలు సోమవారం హైదరాబాద్‌ రూట్‌లోని మడికొండ, రాంపూర్‌ ప్రాంతాల్లో పలు ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, సీనియర్‌ నేతలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్యేలు నరేందర్, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధర్మారెడ్డి తదితరులు వరంగల్‌లో సమావేశమయ్యారు.  

దీక్షా దివస్‌ సందర్భంగా.. 
రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 2009 నవంబర్‌ 29న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్షను గుర్తు చేసుకుంటూ ఆ పార్టీ ఏటా దీక్షాదివస్‌ను పాటిస్తోంది. పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో నవంబర్‌ 29న దీక్షాదివస్‌ సందర్భంగా వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’నిర్వహించాలని ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి స్పందించిన కేసీఆర్‌ ఆ సభను ఈ నెల 29కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే నియోజకవర్గాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు జనసమీకరణపై దృష్టి సారించారు. సభకు తరలేందుకు ఇప్పటికే చేసుకున్న ఏర్పాట్లను 29వ తేదీకి మార్చుకోవాలని కేసీఆర్‌ సూచించారు. 

సభ విజయవంతానికి కేసీఆర్‌ దిశానిర్దేశం  
విజయగర్జన సభ విజయవంతానికిగాను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అక్టోబర్‌ 17న తెలంగాణ భవన్‌లో పార్టీ పార్లమెంటరీ, లెజిస్లేచర్‌ పార్టీ విభాగాల సంయుక్త సమావేశంలో దిశానిర్దేశం చేశారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా అక్టోబర్‌ 18 నుంచి 24 వరకు 103 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో విజయగర్జన సభ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం పారిస్‌ పర్యటనలో ఉన్న కేటీఆర్‌ తిరిగి వచ్చిన తర్వాత విజయగర్జన సభ సన్నాహాలపై మిగతా నియోజకవర్గ నేతలతోనూ సమీక్షలు నిర్వహిస్తారు.   

మరిన్ని వార్తలు