దరఖాస్తు చేసుకుంటేనే టికెట్‌: రేవంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

దరఖాస్తు చేసుకుంటేనే టికెట్‌: రేవంత్‌రెడ్డి

Published Sat, Aug 19 2023 2:24 AM

Ticket only on application - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్నవారి బలాలు, బలహీనతలపై సర్వేలు నిర్వహిస్తామని,  ఆ తర్వాత సామాజిక సమీకరణలు, ఆశావహుల బలాబలాలు, ఇతర పార్టీల్లోని  అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని పలు దశల్లో వడపోత జరిగిన అనంతరం అభ్యర్థి ఎవరనేది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ (సీఈసీ) నిర్ణయిస్తుందని వెల్లడించారు. ఆశావహుల దరఖాస్తులను ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ, స్క్రీనింగ్‌ కమిటీలు కూడా పరిశీలిస్తాయని చెప్పారు.

శుక్రవారం గాం«దీభవన్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్, ఆదివాసీ కాంగ్రెస్‌ జాతీయ వైస్‌ చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్యనాయక్, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్, టీపీసీసీ  వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌లతో కలిసి ఆయన పార్టీ దరఖాస్తు పత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గాంధీభవన్‌లో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని, దరఖాస్తు రుసుమును ఎస్సీ, ఎస్టీలకు రూ.25 వేలు, ఇతర వర్గాలకు రూ.50 వేలుగా నిర్ణయించినట్టు రేవంత్‌ చెప్పారు. ఒకవేళ ఈనెల 25 తర్వాత ఎవరైనా పార్టీలో చేరి టికెట్‌ అడిగితే పీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. 

అభ్యర్థులను పార్టీ ఖరారు చేస్తుంది..  
 గెలుపు ప్రాతిపదికన మాత్రమే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. దరఖాస్తుల స్వీకరణతో అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం ప్రారంభమైందని, తాము అభ్యర్థులమని ఎవరైనా చెప్పుకున్నా, ఫలానా వ్యక్తి అభ్యర్థి అంటూ తనతో సహా ఎవరైనా ప్రకటించినా, అభ్యర్థులు ఖరారయ్యారంటూ మీడియాలో వార్తలు వచ్చినా వాటిని పట్టించుకోవద్దని, అవన్నీ వాస్తవం కాదని స్పష్టం చేశారు. టికెట్ల విషయంలో ఎవరూ పార్టీ కార్యకర్తలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు.  

తొలి దరఖాస్తు దాఖలు.. 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన మొదటి రోజే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్‌ దరఖాస్తు సమర్పించారు. సత్తుపల్లి అసెంబ్లీ టికెట్‌ తనకు కేటాయించాలంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు తన దరఖాస్తును అందజేశారు. మానవతారాయ్‌ వెంట సత్తుపల్లి కాంగ్రెస్‌ నేతలు రావి నాగేశ్వరరావు చౌదరి, దేశిరెడ్డి సత్యనారాయణరెడ్డితో పాటు ఓయూ జేఏసీ నేతలున్నారు.   

Advertisement
Advertisement