కలైంజర్‌ ముఖ్యమంత్రి కాలేరు: పన్నీర్‌సెల్వం

20 Mar, 2021 16:16 IST|Sakshi

తిరువళ్లూరు: కలైంజర్‌ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నోరు జారిన సంఘటన కలకలం రేపింది. అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయపార్టీలు ప్రచార దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొన్నేరి అన్నాడీఎంకే అభ్యర్థి బలరామన్, తిరువళ్లూరు అభ్యర్థి బీవీ రమణ, తిరుత్తణి అభ్యర్థి తిరుత్తణి హరికి మద్దతుగా డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం గురువారం రాత్రి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పొన్నేరిలో పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి కావాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కలైంజర్‌ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో రెండు దశబ్దాలు గడిచినా కలైంజర్‌ ముఖ్యమంత్రి కాలేరు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేసారు. తప్పు దొర్లినట్టు గుర్తించిన పన్నీర్‌సెల్వం, స్టాలిన్‌ ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేరని పేర్కొన్నారు.  కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధికి కలైంజర్‌ అన్న బిరుదు ఉన్న విషయం విదితమే. ఆయన వారసుడిగా డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన స్టాలిన్‌, సీఎం కావాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. 

ఇక ఇప్పటివరకు వెలువడిన సర్వేలన్నీ డీఎంకే అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేస్తున్నాయి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న డీఎంకేకు పట్టం కట్టేందుకు తమిళ ప్రజలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటున్నాయి. ఇక కూటమి సీట్ల కేటాయింపులో భాగంగా, ఆ పార్టీ అభ్యర్థులు 170కు పైగా స్థానాల్లో పోటీచేస్తున్నారు. డీఎంకే మిత్రపక్షాలు సైతం, డీఎంకే ఉదయ సూర్యుడి చిహ్నంపై పోటీ చేస్తుండటం గమనార్హం.

చదవండి: స్టాలిన్‌ది ఒబామా స్టైల్‌!
కమల్‌కు షాక్‌: రూ.11 కోట్లు సీజ్

మరిన్ని వార్తలు