మేమంతా ఒక్కటే  | Sakshi
Sakshi News home page

మేమంతా ఒక్కటే 

Published Tue, Feb 21 2023 3:41 AM

TPCC Chief Revanth Reddy Slams BRS and BJP leaders  - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘మేమంతా ఒక్కటే.. మా నాయకులంతా కలిసే ఉన్నాం.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు ఈ రాష్ట్ర ప్రజలు, మేం సిద్ధంగా ఉన్నాం.. 2024 జనవరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుంది’అని టీపీసీసీ చీఫ్‌ ఎనుముల రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా సోమవారం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో రేవంత్‌ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం హనుమకొండ అమృత జంక్షన్‌ వద్ద నిర్వహించిన సభలో ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ నేతలే కాదు.. బీజేపీ నేతలు కూడా భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా నష్టం జరుగుతున్నా అమరుల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, కానీ సరైన పరిపాలన జరగక కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డు బ్యూరో నివేదిక ప్రకారం రాష్ట్రంలో 80 వేలమంది రైతులు, మూడు వేల మంది నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు ఇప్పటికీ పూర్తికాలేదు కానీ 9 నెలల్లో 10 ఎకరాల్లో 150 గదులతో దొరల గఢీలను తలపించే ప్రగతి భవన్‌ మాత్రం పూర్తయిందని ఎద్దేవా చేశారు.  

ఈస్ట్, వెస్ట్‌ ఎమ్మెల్యేలు బిల్లా రంగాల్లా దోచుకుంటున్నారు 
వరంగల్‌ ఎంపీ పసునూరు దయాకర్‌ పసిపిల్లగాడు అనుకుంటున్నారని, కానీ ఆర్టీసీ టైర్ల ఫ్యాక్టరీని మూసివేసి హంటర్‌ సెంటర్లో 6 ఎకరాల భూమిని కాజేసిన ఘనత ఆయనదని ఆరోపించారు. ఓరుగల్లు ఎమ్మెల్యేలు దండుపాళ్యం ముఠా అని, వరంగల్‌ ఈస్ట్, వెస్ట్‌ ఎమ్మెల్యేలు బిల్లా రంగాల్లా ప్రజలను దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘వరంగల్‌లో ఏ ఎమ్మెల్యేను తీసుకున్నా ఉద్యమం సమయంలో వీరి దగ్గర ఏమీ లేదు.

కానీ ఇప్పుడు వేల కోట్లకు పడగలెత్తారు. దండుపాళ్యం ముఠాకు హన్మకొండ సాక్షిగా హెచ్చరిక చేస్తున్నా. గోడ మీద రాసిపెట్టుకోండి. రోజులు లెక్కపెట్టుకోండి. డైరీలో ప్రతి ఒక్కటీ నోట్‌ చేసుకుంటున్నాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కేసులు పెట్టి వేధించిన దండుపాళ్యం ముఠాకు ఇంతకింత మిత్తితో సహా చెల్లిస్తాం’’ అని హెచ్చరించారు.

పాదయాత్రకు ముందు కాజీపేటలోని హజ్రత్‌ సయ్యద్‌ షా అఫ్జల్‌ బియబాని దర్గాను దర్శించుకొని రేవంత్‌ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, మాజీ మంత్రులు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement