Sakshi News home page

లైలా.. ఓ అంబాసిడర్‌

Published Fri, Apr 5 2024 4:57 AM

Transgender Oruganti Laila Chosen As Icon For Telangana Election Commission - Sakshi

లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి 


ట్రాన్స్‌జెండర్‌లలో అవగాహన పెంచేందుకు క్యాంపెయిన్‌ 


మొట్టమొదటిసారి ట్రాన్స్‌జెండర్‌ 


అంబాసిడర్‌ను నియమించిన ఎన్నికల కమిషన్‌ 


సంక్షేమం, సామాజిక భద్రత అవసరమంటున్న లైలా

సాక్షి, హైదరబాద్‌: లైలా ఓరుగంటి. ఒక ట్రాన్స్‌జెండర్‌. దశాబ్దాలుగా ట్రాన్స్‌జెండర్‌ల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం పని చేస్తున్న  సామాజిక కార్యకర్త. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా  చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌ ఆమెను అంబాసిడర్‌గా నియమియారు. వివిధ సామాజిక వర్గాల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు, అన్ని వర్గాలకు చెందిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఎన్నికల కమిషన్‌ వినూత్నమైన  కార్యక్రమాలను చేపట్టింది. ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్‌ చేపట్టిన  క్యాంపెయిన్‌లో ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి లైలా ఎన్నికల అంబాసిడర్‌గా  వ్యవహరించనున్నారు. ఎన్నికల కమిషన్‌ నిర్వహించే కార్యక్రమాలతో పాటు  ప్రత్యేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని కొనసాగించనున్నారు.‘తెలంగాణలో సుమారు 1.5 లక్షల మంది ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారు.కానీ  ఓటర్లుగా నమోదైన వాళ్లు కనీసం  3 వేల మంది కూడా లేరు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది.’అని  లైలా అభిప్రాయపడ్డారు. 

వివక్ష తొలగలేదు... 
చాలామంది  ట్రాన్స్‌జెండర్‌లుగా జీవనం కొనసాగిస్తున్నప్పటికీ  ఓటింగ్‌లో మాత్రం ‘పురుషులు’ లేదా ‘మహిళలు’గా నమోదు చేసుకుని  తమ ఓటు హక్కును  వినియోగించుకుంటున్నారు.‘ట్రాన్స్‌జెండర్‌లు’గా  నమోదు కావడం లేదు. దీంతో  సామాజికంగా లక్షన్నర మంది  ట్రాన్స్‌జెండర్‌లు  ఉన్నప్పటికీ  ఈ ఎన్నికల్లో  కేవలం 2,737 మంది  మాత్రమే  ట్రాన్స్‌జెండర్‌లుగా నమోదయ్యారు. ఈ వర్గంపైన ఉండే సామాజిక వివక్ష కారణంగా  తమ ఉనికిని చాటుకొనేందుకు  వెనుకడుగు వేస్తున్నారు. సాధ్యమైనంత వరకు గోప్యంగా  జీవించేందుకు  ఆసక్తి చూపుతున్నారు. దీంతో  సంఖ్యరీత్యా మెజారిటీగా ఉండే  ఓటర్ల పట్ల  ప్రత్యేక  శ్రద్ధ  చూపే రాజకీయ పారీ్టలు  ట్రాన్స్‌జెండర్‌లను గుర్తించడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. మరోవైపు  ప్రభుత్వం సైతం  పెద్దగా పట్టించుకోవడం  లేదు.

 ఈ సామాజిక రుగ్మతను  తొలగించుకొనేందుకు ప్రతి ట్రాన్స్‌జెండర్‌ ఓటరుగా నమోదు కావలసి ఉందని  లైలా పేర్కొన్నారు. గత పదేళ్లలో  ట్రాన్స్‌జెండర్‌ల  సంఖ్య రెట్టింపయింది.‘అనేక రకాలుగా  ‘ట్రాన్స్‌’గా జీవనం  కొనసాగిస్తున్నవాళ్లు ఉన్నారు.కానీ  కుటుంబం నుంచి ఎదురయ్యే వివక్ష, అవమానాల కారణంగా ఇళ్ల నుంచి బయటకు వచి్చన వాళ్లు నిర్భయంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారు.’ అని చెప్పారు. 

మరోవైపు  గత అసెంబ్లీ ఎన్నికల్లో  ఇదే కమ్యూనిటీకి చెందిన  పుష్ప  ఎన్నికల్లో పోటీ చేయగా, 2018లో జరిగిన ఎన్నికల్లో  చంద్రముఖి ఎన్నికల బరిలో నిలిచారు. ట్రాన్స్‌ కమ్యూనిటీలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఈ పోటీ ఎంతో దోహదం చేసిందని  ఆ వర్గానికి చెందిన పలువురు అభిప్రాయపడ్డారు.ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో  ఎన్నికల కమిషన్‌  లైలాను  అంబాసిడర్‌గా నియమించడాన్ని కూడా  ట్రాన్స్‌జెండర్‌లు, సామాజిక సంస్థలు  ఆహ్వానిస్తున్నాయి.కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి  సోషియాలజీలో  ఎంఏ చదివిన  లైలా ... స్వచ్చంద సంస్థల ద్వారా  ట్రాన్స్‌జెండర్‌ల సంక్షేమం కోసం  కృషి చేస్తున్నారు. 

పథకాలు అందడం లేదు... 
వివిధ కారణాల వల్ల ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఎలాంటి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లేకుండా బతుకుతున్న తమను  ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, చదువుకున్న వాళ్లకు కూడా ఉద్యోగా లు లభించడం లేదని లైలా ఆవేదన వ్యక్తం చేసింది. దివ్యాంగులు, పేద మహిళలు, తదితర వర్గాలకు లభించే రాయితీ సదుపాయాలు కూడా తమకు అందడం లేదని, అణగారిన వర్గాలకు  ఇళ్లు, ఇంటిస్థలాలు  అందజేస్తున్నట్లుగానే తమకు కూడా  సొంత ఇళ్లకు  ఆర్ధికసహాయం అందజేయలని ఆమె కోరారు. ఈ ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్‌ల  ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నట్లు  పేర్కొన్నారు. 

ట్రాన్స్‌జెండర్‌ల సంఖ్య 1.50 లక్షలు 
2014 అసెంబ్లీ ఎన్నికల్లో  ట్రాన్స్‌జెండర్‌లుగా నమోదైన ఓటర్లు : 2000 
2018 అసెంబ్లీ ఎన్నికల్లో  ఓటు హక్కును వినియోగించుకున్న వారు : 2,885 
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు  : 2,557 
ప్రస్తుతం జరుగనున్న 2024 లోక్‌సభ ఎన్నికల కోసం నమోదైన ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు  : 2,737.    

Advertisement
Advertisement