టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు | Sakshi
Sakshi News home page

టీఎంసీ ఎంపీల ఆందోళన.. ఈడ్చుకెళ్లిన పోలీసులు

Published Mon, Apr 8 2024 7:53 PM

Trinamool Congress Mp Dharna On Delhi Election Commission Office - Sakshi

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌ అధికార పార్టీ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఈడ్చుకెళ్తూ పోలీసు వాహనంలోకి ఎక్కించుకుని వెళ్తున్న దుశ్యాలు వైరల్‌గా మారాయి.  

ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయంలో టీఎంసీ ఎంపీలు హల్‌చల్‌ చేశారు.  బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందంటూ, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఎన్నికల ముందు దర్యాప్తు సంస్థలకు నేతృత్వం వహించే చీఫ్‌లను ఎన్నికల సంఘం తొలగించాలని నినాదాలు చేశారు. 

ఎంపీల ఆందోళనతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మాట వినకపోవడంతో వారిని నెట్టడం, లాగడం, ఎత్తుకెళ్లి పోలీస్‌ వాహనం ఎక్కించారు. అయితే, ఎన్నికల కమీషనర్‌లను కలిసిన తర్వాత వెళ్లిపోవాలని అధికారులు పలుమార్లు చెప్పినప్పటికి వినకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వారిని బలవంతంగా పోలీస్‌ వాహనంలోకి తరలించాల్సి వచ్చిందని పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు.  

ప్రధాని మోదీ హెచ్చరిక
పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో అధికార పార్టీ టీఎంసీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న జూన్ 4 తర్వాత అవినీతిపై చర్యలు వేగవంతం అవుతాయని హెచ్చరించారు. అవినీతిని అంతం చేయకూడదా? అవినీతిపరులను జైలుకు పంపకూడదా? టీఎంసీ అవినీతిని వదిలించుకోకూడదా? ఇది మోదీ హామీ అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం టీఎంసీ ఎంపీలు ఎన్నికల ప్రధాన కార్యాలయంలో ఆందోళన చేపట్టడం గమనార్హం. 

ఆందోళన చేపట్టిన టీఎంసీ
అంతకుముందు తమ పార్టీకి భయం లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. కానీ బీజేపీ మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం ఏజెన్సీలను వాడుకుంటోందని ఆమె ఆరోపించారు. మోడీ కా గ్యారెంటీ అంటున్నారు.. మోడీ గ్యారెంటీ ఏమిటి.. జూన్ 4 తర్వాత అందరినీ జైల్లో పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement