టీఆర్‌ఎస్‌లో వారసుల హవా: మా వాడు వస్తున్నాడు.. దీవించండి! | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో వారసుల హవా: మా వాడు వస్తున్నాడు.. దీవించండి!

Published Sun, Dec 18 2022 8:14 PM

TRS MLC Gutha Sukender Reddy Trying To Bring Son Amit Into Politics - Sakshi

సీనియర్ రాజకీయ నాయకులు చాలా మంది తమ వారసుల అరంగేట్రం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత.. తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం వ్యూహ రచన చేశారు. దాన్ని అమలు చేస్తున్నారు కూడా. తన కుమారుడి గురించి నలుగురు చర్చించుకునే విధంగా స్లోగా తెరమీదకు తెస్తున్నారు. ఏదోవిధంగా గులాబీ బాస్‌ దృష్టిలో తన కుమారుడు పడేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

మా వాడు వస్తున్నాడు.. దీవించండి
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా కొనసాగారు. ఎంతో సీనియర్ అయినప్పటికీ ఆయన రాష్ట్రంలో మంత్రి కాలేకపోయారు. ఆ కోరిక అలాగే మిగిలిపోవడం సుఖేందర్‌రెడ్డిని తొలచివేస్తోందట. అలాగే తన కుమారుడు అమిత్‌రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావడం కూడా ఆయన కోరికల్లో మరొకటి.

ఉమ్మడి జిల్లా నుంచి జగదీష్‌రెడ్డి మంత్రిగా ఉన్నందున మరో రెడ్డి సామాజిక వర్గ నేతకు మంత్రి పదవి ఇచ్చే అవకాశంలేదు. భవిష్యత్‌లో కూడా మంత్రి పదవి దక్కే అవకాశం కూడా కనిపించడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కొడుకునన్నా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయించి చట్టసభలోకి పంపించాలని గుత్తా ప్లాన్ చేస్తున్నారు. 

కొంచెం గుర్తు పెట్టుకోండి.
ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి వీలు దొరికినప్పుడల్లా కొడుకు రాజకీయ ఆరంగేట్రం గురించి ప్రస్తావన తీసుకువస్తున్నారట. దీని ద్వారా అమిత్ పేరుపై జనాల్లో చర్చ జరగాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. జిల్లాలో ఏదో ఒక నియోజవకర్గం నుంచి అమిత్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని గుత్తా చూస్తున్నారట. అయితే అది అంత సులువుగా నెరవేరే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటికే సిట్టింగ్‌లకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆరే ప్రకటించారు. మరోవైపు జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో మొత్తం టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌కు అవకాశం ఎలా వస్తుంది? ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది తెలియాలి. ఒకవేళ ఎమ్మెల్యేగా అవకాశం రాకపోతే నల్లగొండ లోక్‌ సభ స్థానం నుంచి అయినా పోటీ చేయించాలని సుఖేందర్‌ రెడ్డి అనుకుంటున్నారట. ఎలాగూ గతంలో తాను ఎంపీగా పనిచేసిన స్థానం కావడంతో తనకున్న పరిచయాలు ఉపయోగపడతాయని లెక్కలు వేస్తున్నారట. 

మేమూ పోటీలో ఉన్నాం
అయితే నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకునే నేతల లిస్ట్‌ కూడా టీఆర్‌ఎస్‌లో పెద్దగానే ఉందట. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఉత్తమ్ చేతిలో ఓడిపోయిన వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డితో పాటు మరో పారిశ్రామికవేత్త, మొదటి నుంచి పార్టీలో ఉంటున్న ఓ మాజీ ఎంపీ కుమారుడితో పాటు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న మరో నేత కూడా టికెట్ కావాలని కోరుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌కు అవకాశం వస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇన్నాళ్లు తండ్రి చాటు తనయుడిగా పెరిగిన అమిత్‌ ప్రజల్లోకి రాకపోవడం మైనస్‌గా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో తాను పదవిలో ఉన్నప్పుడే కొడుకు రాజకీయ భవిష్యత్‌కు బాటలు వేయాలని గుత్తా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవేళ కుమారుడికి ఎంపీ టికెట్ ఇప్పించుకోవడంలో గుత్తా విఫలం అయితే మాత్రం.. అది అమిత్‌ రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తమ భవిష్యత్ కోసం, వారసుల రాజకీయ భవిష్యత్ కోసం చాలా మంది కలలు కంటారు. కాని కొందరికీ కలలు వాస్తవ రూపంలో నెరవేరతాయి. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడిని చట్టసభకు పంపాలన్నా కల నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. 

పొలిటికల్‌ ఎడిటర్, సాక్షి డిజిటల్‌
feedback@sakshi.com

Advertisement

తప్పక చదవండి

Advertisement