ఈసారి సెంచరీ కొడతాం | Sakshi
Sakshi News home page

ఈసారి సెంచరీ కొడతాం

Published Tue, Oct 10 2023 4:02 AM

TS Assembly polls will be one sided in BRS favour KCR to score hattrick: KTR - Sakshi

ఎన్నికల సమరానికి బీఆర్‌ఎస్‌ ఇప్పటికే సర్వసన్నద్ధమైంది. కాంగ్రెస్‌ అస్త్ర సన్యాసం చేసింది. బీజేపీ కాడి పడేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పాత రికార్డులు తిరగరాసి సెంచరీ కొడుతుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయి. పదేళ్ల ప్రగతి మా పాశుపతాస్త్రం, విశ్వసనీయతే మా విజయ మంత్రం. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని.. బీఆర్‌ఎస్‌ ఘన విజ యం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన తర్వాత ఆయన ‘ఎక్స్‌ (ట్విట్టర్‌)’లో స్పందించారు. ‘‘ప్రజలు రెండు సార్లు నిండు మనసుతో ఆశీర్వదించారు. డిసెంబర్‌ మూడున జరిగే ఓట్ల లెక్కింపులో ముచ్చటగా మూడోసారి గెలిచి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. దక్షత గల నాయకత్వానికే మరోసారి ప్రజలు పట్టం కట్టడం ద్వారా దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం మొదలవుతుంది.

పదేళ్ల ప్రగతి మా పాశుపతాస్త్రం, విశ్వసనీయతే మా విజయ మంత్రం. ప్రజల అండతో బీఆర్‌ఎస్‌కు విజయం.. ప్రతీప శక్తులకు పరాభవం తప్పదు. మా టీమ్‌ కెప్టెన్‌ కేసీఆర్‌ కాబట్టి హ్యాట్రిక్‌ విజయం సాధిస్తాం. మంచి చేసే బీఆర్‌ఎస్‌కు ప్రజలు మద్దతు పలికి.. ముంచే పార్టీలపై వేటు వేస్తారు. ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ దాకా గులాబీ జెండా ఎగురుతుంది. తెలంగాణలో గాంధీ సిద్ధాంతమే తప్ప గాడ్సే రాద్ధాంతం నడవదు. ఉద్యమ చైతన్యం 2014 అసెంబ్లీ ఎన్నికలను నడిపిస్తే.. సంక్షేమ సంబురం 2018లో బీఆర్‌ఎస్‌ను రెండోమారు గెలిపించింది.

తెలంగాణ సాధించిన పదేళ్ల ప్రగతి ప్రస్థానమే 2023 ఎన్నికలో మా విజయాన్ని శాసిస్తుంది. ఎన్నికల సమరానికి బీఆర్‌ఎస్‌ ఇప్పటికే సర్వసన్నద్ధమవగా.. కాంగ్రెస్‌ అస్త్ర సన్యాసం చేసింది, బీజేపీ కాడి పడేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పాత రికార్డులు తిరగరాసి సెంచరీ కొడుతుంది. ముమ్మాటికీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధిస్తాం..’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement