ఉదయనిధి వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్‌ ఏమన్నారంటే.. | Sakshi
Sakshi News home page

ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్‌ ఏమన్నారంటే..

Published Mon, Sep 4 2023 11:53 AM

Udhayanidhi Stalin Sanatana Dharma Remarks Father Podcast Targets BJP - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చిన మంత్రి.. దానిని సమూలంగా నిర్మూలించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

బీజేపీ, హిందూ సంఘాల ఆందోళన
తమిళనాడులో హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. సోషల్‌ మీడియా వేదికల్లోనూ ఉదయనిధిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో ఉదయనిధి చర్చ్‌, స్వామిజీ వద్దకు వెళ్లిన ఫోటోలు షేర్‌ చేస్తూ.. దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయి. మరోవైపు తమిళనాడు గవర్నర్‌ను బీజేపీ నేతలు కలిశారు. ఉదయనిధిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని గవర్నర్‌కు వినతి చేశారు. స్టాలిన్‌ వీడియోతో బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

మంత్రికి మద్దతుగా ప్రకాశ్‌ రాజ్‌
ఇక ఉదయనిధికి మద్దతుగా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ నిలిచారు. సనాతన పార్లమెంట్‌ భవిష్యత్తు ఇలా ఉంటుందా అంటూ మోదీ స్వామీజీల పోటో షేర్‌ చేశారు. తాజాగా కొడుకు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్పందించారు. ఉదయనిధి సనాతన ధర్మం వ్యాఖ్యలను సీఎం సమర్థిస్తూ బీజేపీపై విరుచుకుపడ్డారు. తన కుమారుడు చెప్పిన దాంట్లో అక్షరం ముక్క తప్పులేదని అన్నారు. ఉద్యోగాలు, ద్రవ్యోల్బణంపై మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
చదవండి: Karnataka: బీజేపీ నేతలకు డీకే గాలం! 

బీజేపీ హయాంలో దేశం నాశనం..
 తన పాడ్‌కాస్ట్‌ ‘స్పీకింగ్ ఫర్ ఇండియా’లో స్టాలిన్‌ మాట్లాడుతూ.. బీజేపీ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ఆయుధంగా వాడుతోందని మండిపడ్డారు. ప్రజల మతపరమైన భావాలను రెచ్చగొట్టి.. ఆ మంటల వెచ్చదనంలో బీజేపీ చలికాచుకోవాలని చూస్తోందని విమర్శించారు. భారత నిర్మాణాన్ని, దేశ ఐక్యతను నాశనం చేయాలని ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

ఇప్పుడు ఆపకపోతే ఎవరూ రక్షించలేరు
2002లో గుజరాత్‌ అల్లర్లు బీజేపీ హింస, ద్వేషానికి బీజాలు వేసిందన్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌, హర్యానాలో చెలరేగిన హింసాత్మక ఘర్షణలు వేలాది మంది అమయాక ప్రజల ప్రాణాలను, ఆస్తులను బలితీసుకుందని మండిపడ్డారు. ఇప్పటికైనా దీనిని అరికట్టకపోతే.. దేశాన్ని, భారతీయులను ఎవరూ రక్షించలేరని ఎంకే స్టాలిన్ హెచ్చరించారు.

మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన సీఎం పోడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో.. ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన ఏ హామీని గత తొమ్మిదేళ్లలో నెరవేర్చలేదని స్టాలిన్ పేర్కొన్నారు. ప్రజలందరి ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షలు జమ కాలేదని, రైతుల ఆదాయాలు రెండింతలు కాలేదని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ జరగలేదని ముఖ్యమంత్రి బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారతదేశం మొత్తం మణిపూర్, హర్యానాగా మారకుండా నిరోధించడానికి ఇండియా కూటమి తప్పక గెలవాలన్నారు.
చదవండి: జీ 20 సదస్సుకు జిన్‌పింగ్‌ గైర్హాజరు.. స్పందించిన బైడెన్‌

ఉదయనిధి స్టాలిన్‌ ఏమన్నారంటే..
‘తమిళనాడు ప్రొగ్రెసివ్‌ రైటర్స్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ శనివారం ‘సనాతన నిర్మూలన’ పేరుతో నిర్వహించిన సమావేశంలో  ఉదయనిధి స్టాలిన్‌  హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement