రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం

Published Wed, Mar 13 2024 5:41 AM

union minister amit shah said we will cancel muslim reservations in telangana - Sakshi

కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు అవినీతి, కుటుంబ పార్టీలు: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

రాహుల్‌ విదేశీ విశ్రాంతి పర్యటన చేయాల్సిందే

బీజేపీ రాష్ట్ర సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశంలో ప్రసంగం

సాక్షి, మేడ్చల్‌ జిల్లా/చార్మినార్‌: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా చెప్పారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల ఎజెండా ఒక్కటేనని, రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ మూడు పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని దుయ్య పట్టారు. మంగళవారం సికింద్రాబాద్‌ ఇంపీరియల్‌ గార్డెన్‌లో బీజేపీ రాష్ట్ర సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశంలో అమిత్‌షా మాట్లాడారు. తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ సర్కారు, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం మజ్లిస్‌ చేతిలో కీలు బొమ్మలన్నారు.

బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ అవినీతి జాబితా పంపిస్తానని, దానిపై జవాబు చెప్పిన తర్వాతనే బీజేపీపై విమర్శలు చేయాలని హితవు పలికారు. ఎన్నికల తర్వాత రాహుల్‌ గాంధీ ఇటలీ వెళ్లి సేద తీరాల్సిందేనని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.10వేల కోట్లు సాయం చేసిందన్నారు. తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అమిత్‌షా తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

సోషల్‌ మీడియా వారియర్స్‌ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. బీఆర్‌ఎస్‌కు సీట్లు వచ్చినా.. రాకున్నా.. రాష్ట్రానికి ఉపయోగం లేదని, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ఓటేస్తే అది దుర్వినియోగం అవుతుందని చెప్పారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీని మళ్లీ ప్రధాని చేయాలని, మోదీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతీ సోషల్‌ మీడియా కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌లో ఒవైసీని ఓడిస్తాం: కిషన్‌రెడ్డి
పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే.. తెలంగాణలో బలమైన పార్టీగా ఎదగగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈసారి హైదరాబాద్‌లో అసదుద్దీన్‌ ఒవైసీని ఓడిస్తామని చెప్పారు. జాతీయ, రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సోషల్‌ మీడియా వారియర్స్‌ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇతర పార్టీల తప్పుడు ప్రచారాలను ఖండించాలని చెప్పారు. ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, మహేశ్వర్‌రెడ్డి, ఎంవీఎస్‌ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు
అమిత్‌ షా మంగళవారం సాయంత్రం చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, హైదరాబాద్‌ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవి లత తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement