కాంగ్రెస్‌ ఉప్పెనలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం ఖాయం: ఉత్తమ్‌ | Uttam Kumar Reddy Comments On BRS MLA Candidates List - Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఉప్పెనలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం ఖాయం: ఉత్తమ్‌

Published Wed, Aug 23 2023 8:29 AM

Uttam Kumar Reddy Comments On Contest In Elections BRS Candidtes List - Sakshi

సాక్షి, (సూర్యాపేట): రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 70 నుంచి 80 వరకు ఎమ్మెల్యే సీట్లు గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్‌ పార్టీ ఉప్పెనలో బీఆర్‌ఎస్‌ కొట్టుకుపోవడం తధ్యమని నల్లగొండ ఎంపీ ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సూర్యాపేటలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో, అలాగే మఠంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.

తాను కార్యకర్తల అభీష్టం మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను కార్యకర్తలంతా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు అంగబలం, అర్ధబలంతో ఎన్నికష్టాలు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కార్యకర్తలంతా కాంగ్రెస్‌ పార్టీ గెలుపు కోసం మిలిటెంట్లలాగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.
చదవండి: అవినీతిలో ఆస్కార్‌ ఇవ్వొచ్చు.. కేసీఆర్‌కు ఎదురుదెబ్బ ఖాయం..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌ స్థానాల్లో 50 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఓపికతో వ్యవహరిస్తారని, రెండుసార్లు కేసీఆర్‌కు అధికారమిచి్చ.. ఇక మూడోసారి ఇచ్చేది లేదన్న నిర్ణయానికి వచ్చారని తెలిపారు. వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్నట్లుగా సీఎం చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, దేశంలోనే క్రాప్‌ ఇన్సూరెన్స్‌ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు.

హౌసింగ్‌ స్కీమ్‌లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అవినీతిలో ముందంజలో ఉందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు పోలీసు వ్యవస్థను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఇసుక, మైనింగ్, వసూళ్లు, లిక్కర్‌ ఇలా అన్నిరకాలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
Advertisement