సీఎం మీద పోటీకి సిద్ధమవుతున్న మాజీ ఐపీఎస్‌ అధికారి | Sakshi
Sakshi News home page

సీఎం మీద పోటీకి సిద్ధమవుతున్న మాజీ ఐపీఎస్‌ అధికారి

Published Sat, Aug 14 2021 6:39 PM

UP Election: Ex Cop Amitabh Thakur To Contest Yogi Adityanath - Sakshi

లక్నో: వచ్చేఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎలక్షన్‌ బరిలో తాను నిలబడనున్నట్లు ప్రకటించారు మాజీ ఐపీఎస్‌ అధికారి అమితాబ్‌ ఠాకూర్‌. పోలీసు ఉద్యోగానికి ముందస్తు పదవీవిరమణ చేసిన అమితాబ్‌ ఠాకూర్‌.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మీద పోటీ చేస్తారని ఆయన కుటుంబ సభ్యులు ప్రకటించారు. యోగి ఆదిత్యనాథ్‌ ఎక్కడి నుంచి బరిలోకి దిగితే.. అమితాబ్‌ ఠాకూర్‌ కూడా అక్కడే పోటీ చేస్తారని ప్రకటించారు.

ఏకంగా సీఎం మీదనే పోటీకి సిద్ధమవతున్న అమితాబ్‌ ఠాకూర్‌ నిర్ణయం దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీసుకున్న ఓ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అమితాబ్‌ ఠాకూర్‌ ఈ ఏడాది మార్చి 23న ఉద్యోగానికి రాజీనామా చేశారు. వాస్తవంగా ఆయన సర్వీసు 2028 వరకు ఉన్నప్పటికి ప్రజాశ్రేయస్సు కోసం ఏడేళ్ల ముందుగానే పదవీవిరమణ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ సందర్భంగా అమితాబ్‌ ఠాకూర్‌ భార్య మాట్లాడుతూ.. ‘‘యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ అనేక అప్రజాస్వామిక, అక్రమ, నిర్బంధ, వేధింపు, వివక్ష చర్యలకు పాల్పడ్డారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అక్రమాలకు.. అమితాబ్‌ నమ్మిన ఆదార్శలకు మధ్య జరుగుతున్న పోరాటం. ఇందుకోసం యోగి ఆదిత్యనాథ్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తే.. అమితాబ్‌ కూడా అక్కడే బరిలో నిలుస్తారు’’ అని తెలిపారు.

2017 లో, అమితాబ్ ఠాకూర్ తన కేడర్‌ని వేరే రాష్ట్రానికి మార్చమని కేంద్రాన్ని కోరారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన ములాయం సింగ్ యాదవ్ తనను బెదిరించారని ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత, అమితాబ్‌ ఠాకూర్‌ని జూలై 13, 2015 న సస్పెండ్ చేశారు. ఆయనపై విజిలెన్స్ విచారణ కూడా ప్రారంభమైంది.

Advertisement
Advertisement