ఆక్వా జోన్‌ విధానం తెచ్చింది చంద్రబాబే.. | Sakshi
Sakshi News home page

ఆక్వా జోన్‌ విధానం తెచ్చింది చంద్రబాబే..

Published Tue, Sep 5 2023 5:44 AM

Vaddi Raghuram comment on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: ఆక్వా రంగం గురించి కనీస అవగాహన లేకుండా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఏపీ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం టీడీపీ నేత నా­రా లోకేశ్‌ను హెచ్చరించారు. భీమవరంలో ఆక్వా రైతుల సమావేశంలో లోకేశ్‌ చేసిన వ్యాఖ్య­లపై ఆయన మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఆక్వా జోన్, నాన్‌ ఆక్వా జోన్‌ అంటే ఏంటో తెలుసా? 

ఈ జోన్‌ విధానం తెచ్చిందే మీ తండ్రి చంద్రబాబు హయాం­­లో కాదా.. ఈ విధానాన్ని 2018లో ప్రారంభించి, మీ తండ్రి చంద్రబాబు మధ్యలో గాలికొదిలేస్తే, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక సర్వే ద్వారా జోన్, నాన్‌ జోన్‌ పరిధిని నిర్ధారించారని తెలిపారు. రాష్ట్రంలో 4.65 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుండగా, ఆక్వా జోన్‌ పరిధిలో 10 ఎకరాల్లోపు 3.27 లక్షల ఎకరాలను తీసుకొచ్చి, యూ­ని­ట్‌ రూ.1.50కే విద్యుత్‌ సబ్సిడీ అందిస్తూ సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు అండగా నిలుస్తు­న్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

ఎన్ని­­కలకు ఆర్నెల్ల ముందు యూనిట్‌ విద్యుత్‌ రూ.­2కే ఇస్తానని ఆక్వా రైతులకు నమ్మబలి­కి, డిస్కంలకు చెల్లించాల్సి న సబ్సిడీని ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. మీ తండ్రి ఎగ్గొట్టిన బకాయిలు చెల్లించడమే కాదు, రైతుల తరఫున డిస్కమ్‌లకు చెల్లించాల్సి న మొత్తాన్ని అణాపైసలతో సహా చెల్లిస్తున్నట్టు తెలిపారు. నరసాపురంలో దేశంలోనే మూడో మత్స్య యూనివర్సిటీ ఉందన్న విషయాన్ని కూడా మరచి ‘మాకు అధికారాన్నిస్తే ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తా’ అంటూ హామీ ఇవ్వడం లోకేశ్‌ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

వెనామియా కల్చర్‌కు అనుమతి లేకున్నా కేంద్రంతో మాట్లాడి రైతులను ఆదుకున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఆక్వా రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్నైనా అమలు చేశారా.. అని ప్రశ్నించారు. మీ తండ్రి హయాంలో రొయ్యల ధరలు గంటకో రీతిలో ఉండేవి. ధరలు పతనమైనప్పుడు ఏనాడైనా జోక్యం చేసుకుని ప్రాసెసింగ్‌ కంపెనీలు, ఎగుమతిదారులను పిలిపించి మాట్లాడారా.. అంటూ నిలదీశారు.

కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనూ రొయ్య రైతులకు ఇబ్బంది లేకుండా రవాణ, ఎగుమతులు కొనసాగేలా చర్యలు తీసుకోవడమే కాదు.. గిట్టుబాటు ధర దక్కేలా సీఎం వైఎస్‌ జగన్‌ కృషి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాదు ప్రాసెసింగ్‌ ప్లాంట్స్, రైతులతో మాట్లాడి ప్రతి 10 రోజులకోసారి రేట్లు నిర్ణయించి, కచ్చితంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆక్వా రైతుల కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని వాటిని వివరించారు.   

Advertisement
Advertisement