Sakshi News home page

వీడియో: కన్నీళ్లు పెట్టిన కూరగాయల వ్యాపారి.. నవ్వులు పూయించిన రాహుల్‌ గాంధీ

Published Fri, Aug 18 2023 9:37 PM

Vegetable Vendor Who Broke Down On Camera Meets Rahul Gandhi - Sakshi

రామేశ్వర్‌.. అడ్డగోలుగా పెరిగిన టమాట ధరలు.. వాటి వల్ల తాను ఎలాంటి కష్టాలు అనుభవిస్తోంది చెబుతూ కన్నీటి పర్యంతమైన ఓ కూరగాయల వ్యాపారి. ఆ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయ్యింది.

కట్‌ చేస్తే.. ‘‘నాకు ఈ సమాజంలో బతకాలని లేదు’’ అంటూ భార్యా, కూతురు పక్కన ఉండగానే రామేశ్వర్‌.. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్‌ గాంధీకి తన కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. ఆ సమయంలో అలా మాట్లాడొద్దంటూ ఆయనకు ధైర్యం చెప్పడమే కాదు.. ఆయన ముఖంలో చిరునవ్వులూ పూయించారు రాహుల్‌. 

వీడియో వైరల్‌ అయిన తర్వాత ఢిల్లీలోని ఆజాదీ మండీ కూరగాయల మార్కెట్‌ను రాహుల్‌ గాంధీ స్వయంగా సందర్శించి.. అక్కడి వ్యాపారుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ టైంలో రామేశ్వర్‌ను ఆయన కలవలేకపోయారు. దీంతో ఆయన్ని  ఇంటికి రప్పించుకున్న రాహుల్‌ గాంధీ.. లంచ్‌ తానే స్వయంగా వడ్డించాడు. ఆయన భార్య ఉపవాసం అని తెలుసుకుని.. కావాలంటే పండ్లు తీసుకొస్తానంటూ రాహుల్‌ అనడమూ ఆ వీడియోలో ఉంది.  ఆపై అతని కష్టాలను సావధానంగా విన్నారు కూడా. అంతేకాదు.. అతనికి ధైర్యాన్ని అందించారు కూడా. 

‘‘రామేశ్వర్‌జీ గొంతు.. ఆయన ఒక్కరిదే కాదు. దేశంలో ఆయనలా బాధలు, సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్న ఎంతోమంది గొంతుక. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చర్చల్లో కూడా లేకుండా పోయింది. వాళ్ల గొంతుకను వినడమే కాదు.. సమస్యతో పోరాడుతున్న వాళ్‌లకు సాయం అందించడం కూడా మన నైతిక బాధ్యత అంటూ రాహుల్‌ గాంధీ ట్విటర్‌(ఎక్స్‌)లో పోస్ట్‌ చేశారు.  

ఢిల్లీ ఆజాద్‌పూర్‌ మండీకి చెందిన రామేశ్వర్‌ పెరిగిన కూరగాయల ధరలు తన మనుగడకు ఎలాంటి అవాంతరం కలిగిస్తుందో చెబుతూ.. రామేశ్వర్‌ కన్నీటి పర్యంతం అయ్యారు.  ఆ వీడియో వైరల్‌ కావడంతో.. పలువురు రాజకీయ నేతలు సహా సోషల్‌ మీడియాలో పెద్ద ఎతున సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. 

Advertisement
Advertisement