Sakshi News home page

మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి ఇంట్లో సోదాలు

Published Wed, Aug 11 2021 10:08 AM

Vigilance raids properties of Velumani seizes Rs13L cash - Sakshi

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణికి సంబంధించిన ఇళ్లు, సంస్థలే లక్ష్యంగా మంగళవారం తమిళనాడులో 60 చోట్ల డైరెక్టరేట్‌ ఆఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ యాంటీకరప్షన్‌ (డీవీఏసీ) సోదాలు నిర్వహించింది. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలోనూ దాడులు జరిగాయి. వేలుమణితో సహా 17 మందిపై డీవీఏసీ కేసుల్ని నమోదు చేసింది.

డీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం గత నెల అన్నాడీఎంకేకు చెందిన రవాణాశాఖ మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌పై  ఐటీ దాడులు జరిగాయి. ప్రస్తుతం నగరాభివృద్ధి శాఖ మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి టార్గెట్‌గా కోయంబత్తూరులో 42 చోట్ల, చెన్నైలో 16 చోట్ల, దిండుగల్, కాంచీపురంలలో తలా ఓ చోట డీవీఏసీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో చెన్నై , కోయంబత్తూరు కార్పొరేషన్లలో రూ. 810 కోట్ల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు, మంత్రి , ఆయన  సన్నిహితులు ఆదాయానికి మించి ఆస్తులు గడించినట్లు దర్యాప్తులో స్పష్టం కావడంతో డీవీఏసీ ఈ దాడులు చేసింది. వేలుమణి, ఆయన సోదరుడు అన్భరసన్, సన్నిహితుడు చంద్రశేఖర్, గతంలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేసిన మధురాంతకీ, చెన్నై కార్పొరేషన్‌ ప్రధాన ఇంజినీరు నందకుమార్, మాజీ ఇంజినీరు పుగలేంది ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. కాగా దాడులను నిరసిస్తూ అన్నాడీఎంకే వర్గాలు పలుచోట్ల ఆందోళన నిర్వహించాయి.

Advertisement

What’s your opinion

Advertisement