TDP: డబ్బు కొట్టు... టికెట్‌ పట్టు! | Sakshi
Sakshi News home page

TDP: డబ్బు కొట్టు... టికెట్‌ పట్టు!

Published Sun, Mar 24 2024 4:46 AM

The voice of the phone call making the rounds on social media - Sakshi

రూ.15 కోట్లు చెల్లించినవారికే కొవ్వూరు టీడీపీ సీటు

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఫోన్‌ కాల్‌ వాయిస్‌

కొవ్వూరు: తెలుగుదేశం పార్టీలో టికెట్లు అ­మ్ము­కున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూ­ర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టికెట్టు ఖరారు విషయంలో జరిగిన బేరసారాల సంభాషణ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.‘రూ.10 కోట్లు చూసుకోండి.. టికెట్టు ఇప్పిస్తాం’ అంటూ జిల్లాలోని నిడదవోలుకు చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ మహిళకు స్థానిక నాయకులు వర్తమానం పంపారు.

ఆమె సొమ్ము రెడీ చేసుకుంటున్న తరుణంలోనే ముప్పిడి వెంకటేశ్వరరావుకు టికెట్‌ ఖరారు చేశారు. దీనిపై ఆమె ఆ ముఖ్య నాయకుడికి ఫోన్‌ చేసి ‘రూ.10 కోట్లు తెస్తే నాకు టిక్కెట్టు ఇప్పిస్తామంటే సరే అన్నాను. ఇప్పుడిలా చేశారేమిటి?’ అని ప్రశ్నించారు. ఆ నాయకుడు ‘డబ్బు లేకుండా రాజకీయం లేదు. అంతా కోట్ల మీదే పని’ అని ఆమెకు బదులిచ్చారు.

‘రూ.10 కోట్లు తెచ్చుకోమ్మా. మేం మాట్లాడతామని నాతో అన్నారు. టికెట్టు వచ్చిన వ్యక్తి ఎంత ఇచ్చారు?’ అని ఆ మహిళ ప్రశ్నిస్తే ‘రూ.15 కోట్లు ఇస్తేనే టికెట్టు ఇచ్చారు’ అని ఆయన చెప్పారు. ‘అంటే నాకంటే మరో రూ.5 కోట్లు పెంచారన్న మాట. ఇంత మాత్రం దానికి రూ.10 కోట్లు తెచ్చుకోమనడం దేనికి’ అంటూ ఆమె వాపోయింది. 

మండిపడుతున్న పార్టీ శ్రేణులు
నియోజకవర్గ ప్రముఖ నాయకుడికి సన్నిహితుడైన చా­గల్లుకు చెందిన ఓ నాయకుడు ఆ మహిళతో మా­ట్లాడిన ఈ ఫోన్‌ సంభాషణలు టీడీపీలోనూ దు­మా­రం రేపుతున్నాయి. రూ.15 కోట్లిచ్చినవారికే టికె­ట్టిచ్చినట్టు గుప్పుమనడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. గెలుపు గుర్రాలను పక్కన పెట్టి డబ్బు సంచులకే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒకవైపు అతి సామాన్య కుటుంబాలకు చెందిన వ్యక్తులకు వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తుంటే టీడీపీ మా­త్రం డబ్బుకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆ పార్టీ శ్రేణు­లు జీర్ణించుకో­లేక­పో­తు­న్నాయి. కేవలం సర్వేలను ప్రామాణికంగా తీసు­కునే తమ పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లు చంద్రబాబు పదేపదే చెబుతున్న మాటలు వాస్తవం కాదని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమ­ర్శిస్తు­న్నారు.

ఈ నియోజకవర్గంలో తొలుత ముగ్గురు వ్యక్తులపై ఐవీఆర్‌ఎస్‌ విధానంలో సర్వే నిర్వహించి చివరకు ఆ ముగ్గురిని కాదని ముప్పిడికి టికెట్టు కేటా­యించడం వారి ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. 

Advertisement
Advertisement