కాంగ్రెస్‌కు ఆ జిల్లాలో అభ్యర్థుల కరువు.. సొంత పార్టీలో లేకపోతేనేం.. | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ఆ జిల్లాలో అభ్యర్థుల కరువు.. సొంత పార్టీలో లేకపోతేనేం.. పక్క పార్టీల నాయకులకు గాలం

Published Sat, Jul 1 2023 8:33 PM

Warangal Congress Focus On Elections Searching For Other Party leaders - Sakshi

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఈసారి అధికారంలోకి వస్తామనే ధీమా కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది. కాని అన్ని చోట్లా సరైన అభ్యర్థులు దొరకాలిగా? అందుకే గెలుపు గుర్రాల అన్వేషణ ప్రారంభించారు. సొంత పార్టీలో లేకపోతే పక్క పార్టీల వారికి గాలం వేస్తున్నారట పీసీసీ నేతలు. ఇంతకీ ఓరుగల్లులో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది?..

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎన్నడూ లేనివిధంగా ఐక్యతా రాగం వినిపిస్తోంది. నాయకుల మధ్య విభేదాలు ఎన్ని ఉన్నా..అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ కలిసికట్టుగా పనిచేసి గెలుద్దామన్న ఆలోచనలు కనిపిస్తున్నాయనే చర్చ అయితే సాగుతోంది. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించాలని అక్కడి నేతలు పట్టుదలతో ఉన్నారు.

ఇంటిలిజెన్స్ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన నివేదికలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌కే అనుకూల పరిస్థితులున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీ నాయకత్వం కూడా దీనిపై విభేదించడంలేదని, అయినప్పటికీ కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద ఉండబోవని బీఆర్ఎస్ నాయకలు చెబుతున్నారు. కాని గులాబీ పార్టీ శిబిరంలో ఆందోళన కనిపిస్తోందనే టాక్ నడుస్తోంది.

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజ‌క‌ వ‌ర్గాలకు గాను..11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరిలో ప‌లువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పైన ప్రజ‌ల్లో తీవ్ర వ్యతిరేక‌త కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం సొంతంగా చేయించుకున్న స‌ర్వేలోనూ ఇదే విష‌యం స్పష్టమైన‌ట్లు తెలుస్తోంది. భూ దందాలు, బినామీ పేర్లతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్లకు ఎమ్మెల్యేలు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
చదవండి: రేపు వరంగల్‌లో బీజేపీ సన్నాహక సమావేశం.. ఆ నేతలు కలిసి పనిచేసేనా?

కేవ‌లం ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాల పంపిణీకే ఎమ్మెల్యేలు ప‌రిమితం అవుతున్నార‌న్న విమ‌ర్శలు బాగా ఉన్నాయి. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి గురించి పట్టించుకోకుండా.. ప్రజా స‌మ‌స్యల‌ను గాలికి వ‌దిలేసి తమకు ఆదాయాన్ని అందించేవారికే అపాయింట్‌మెంట్ ఇస్తూ.. ఎక్కువ స‌మ‌యం వారికే కేటాయిస్తున్నార‌న్న చర్చ బ‌లంగా నడుస్తోంది. పైగా ప్రతీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ బీఆర్ఎస్‌లో అంత‌ర్గత కుమ్మలాట‌లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నేతల తీరు ఇలాగే కొనసాగితే జిల్లాలో ప‌రిస్థితి చేజారే ప్రమాదం ఉందని ప‌లు స‌ర్వేల ద్వారా బీఆర్ఎస్ అధిష్టానానికి స్పష్టంగా అర్థమైన‌ట్లు సమాచారం.

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో గెలుస్తామ‌న్న ధీమా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లోని ఉన్న బలమైన నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా నర్సంపేట, మహబూబాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలతో చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

మిగిలిన నియోజకవర్గాల్లో పోటీకి చాలా మంది నాయకులున్నట్లు తెలుస్తోంది. పై మూడు సెగ్మెంట్లలో చర్చలు సఫలమైతే వారు త్వరలోనే హస్తం పార్టీలో చేరతారని అంటున్నారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీయే అని ప్రజలు విశ్వసిస్తున్నందున, నాయకులంతా ఐక్యంగా ఉంటూ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలని హైకమాండ్‌ నేతలకు సూచించిందని సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement