ఒంటరిగానే పోటీ చేస్తాం | Sakshi
Sakshi News home page

ఒంటరిగానే పోటీ చేస్తాం

Published Fri, Nov 3 2023 2:03 AM

We will compete alone says Tammineni Veerabhadram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ప్రస్తుతం 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలవకూడదనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గురువారం ఎంబీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించామని, రెండు స్థానాల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ ఆ రెండు స్థానాలేమిటో కాంగ్రెస్‌ చెప్పలేదన్నారు. కేవలం బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు చేసినట్లు ఆయన చెప్పారు. ఆ పార్టీ వైఖరి వల్లే పొత్తు నుంచి తప్పుకొని ఒంటరిగా పోటీకి నిర్ణయం తీసుకున్నామని తమ్మినేని తెలిపారు. తొలుత 17 స్థానాల్లో పోటీకి నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఈ సంఖ్య పెరుగుతుందని, పార్టీ కార్యకర్తలు, బలం ఉన్న చోట పోటీకి సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. 

ఐక్య పోటీపై సీపీఐ వైఖరి చెప్పలేదు.. 
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ సీపీఐ వైఖరి చెప్పలేదని తమ్మినేని పేర్కొన్నారు. అయినప్పటికీ సీపీఐకి మద్దతిస్తామని, ఒకవేళ కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగించి సీపీఐ పోటీ చేసినా ఆ పార్టీకి మద్దతిస్తూ అక్కడ పోటీ చేయబోమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే స్థానాల్లో కాకుండా మిగతా చోట్ల బీజేపీని ఓడించే ప్రధాన పార్టీకి మద్దతివ్వాలని తమ కార్యకర్తలకు సూచిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులు బలంగా ఉన్న చోట్ల ఆ తర్వాత స్థానంలో ఉన్న బీఆర్‌ఎస్‌ లేదా కాంగ్రెస్‌ లేదా ఇతరులెవరున్నా సీపీఎం మద్దతుగా నిలుస్తుందని తమ్మినేని స్పష్టం చేశారు. 

17 స్థానాలు ఇవే... 
ఇప్పటివరకు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా భద్రాచలం (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ), పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), ఖమ్మం, సత్తుపల్లి (ఎస్సీ), మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్‌ (ఎస్సీ), భువనగిరి, హుజూర్‌నగర్, కోదాడ, జనగామ, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ముషీరాబాద్‌ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తమ్మినేని వెల్లడించారు. ఒకట్రెండు రోజుల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు, సీనియర్లతో చర్చించిన తర్వాత ఈ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. కాగా, ఈ జాబితాలో ముషీరాబాద్‌ అభ్యర్థిగా సీపీఎం హైదరాబాద్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దెల దశరథ్‌ పేరు ఖరారైనట్లు తెలిసింది. 

Advertisement
Advertisement