CM KCR Likely to Contest From Kamareddy Constituency? - Sakshi
Sakshi News home page

గులాబీ బాస్‌ ప్రయోగం చేయబోతున్నారా?.. నిజంగానే అలా జరిగితే..

Published Sun, Aug 20 2023 6:44 PM

Will Cm Kcr Likely To Contest From Kamareddy Constituency - Sakshi

గులాబీ బాస్ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రయోగం చేయబోతున్నారా? గతంలో సిద్ధిపేటలో వరుసగా గెలిచిన కేసీఆర్‌ తెలంగాణ ఆవిర్భావం తర్వాత గజ్వేల్‌ నుంచి రెండుసార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌ నుంచి పోటీ చేయరంటూ ప్రచారం సాగుతోంది. నిజంగానే గజ్వేల్‌ నుంచి మరో నియోజకవర్గానికి వలస వెళ్లాలని డిసైడ్ అయ్యారా? ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? నిర్ణయం నిజమే అయితే ఎక్కడికి వెళ్ళబోతున్నారు? 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ పరిధిలోకి వచ్చే కామారెడ్డి నుంచి బరిలో నిలుస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి పోటీచేస్తే ఉమ్మడి జిల్లాలోని 9 నియోజవర్గాల్లోనూ స్వీప్ చేయవచ్చనే ఆలోచనతో కామారెడ్డి నుంచి పోటీ చేయాలని అక్కడి నేతలు కేసీఆర్‌ను కోరుతున్నట్లు చెబుతున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్ స్వయంగా కేసీఆర్ పోటీ గురించి ప్రకటించడంతో జిల్లాలో సంచలనంగా మారింది.

కామారెడ్డి నుంచి పోటీ చేయాలని తానే సీఎం కేసీఆర్‌ను మూడు సార్లు కోరినట్లు గోవర్థన్ తెలిపారు. కేసీఆర్‌ బరిలో ఉంటే ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి కేసీఆర్‌ను గెలిపించుకుంటామని అన్నారు. తాను ఏమి చేయాలో సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని ప్రభుత్వ విప్‌ చెప్పుకొచ్చారు. కేసీఆర్‌ సొంత గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్‌ అని గోవర్థన్ తెలిపారు. ఇటీవల మంత్రి కేటీఆర్‌ సైతం తన నానమ్మ పేరిట సొంత నిధులతో కోనాపూర్‌లో ప్రభుత్వ పాఠశాల నిర్మించారన్నారు. అయితే కేసీఆర్‌ కామారెడ్డి బరిలో ఉంటారా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
చదవండి: కాంగ్రెస్‌కు హ్యాండిచ్చారా?.. కారు దిగాలనుకున్న ఆ నేతలు రూట్ మార్చారా?

కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీ చేస్తే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాలైన జగిత్యాల, సిరిసిల్లా, సిద్దిపేటలోను బీఆర్‌ఎస్‌కు మరింత బలం చేకూరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 9 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ నిర్వహించిన పలు సర్వేల్లో రెండు, మూడు నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్లు తేలింది. దీంతో కామారెడ్డి నుంచి కేసీఆర్‌ బరిలో ఉంటే ఉమ్మడి జిల్లాలోని 9 సీట్లలోనూ క్లీన్‌ స్వీప్‌ చేయవచ్చని ఆ పార్టీ ముఖ్యనేతలు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌తో పోటీ చేయించాలన్న ఆలోచనను ఆ పార్టీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు. గత ఏడాది కిందట బీబీపేట మండలం కోనాపూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మంత్రి కేటీఆర్‌ వచ్చారు. ఆ సమయంలో తన నానమ్మ నివాసం ఉన్న కోనాపూర్‌లోని ఇల్లుని మంత్రి కేటీఆర్‌ సందర్శించి తన పూర్వీకులను గుర్తు చేసుకున్నారు. తమ సొంత ఊరుకు ఏదో ఒకటి చేయాలనే భావనతో కేటీఆర్‌ కోనాపూర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలను 2.5 కోట్ల సొంత నిధులతో పునర్నిర్మించారు. పాఠశాల భవనమే కాకుండా ఆ గ్రామంలో పలు బీటీ, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. త్వరలోనే ఈ అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

గత ఎన్నికల్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది స్థానాల్లో ఎనిమిదింటిని గులాబీ పార్టీ గెలుచుకుంది. ఒక్క ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీపై బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్దన్ కేవలం ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి కామారెడ్డిలో వ్యతిరేకత మరింతగా పెరిగిందని..కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో కామారెడ్డిపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కామారెడ్డి నుంచి పోటీ చేయడం వల్ల ఆ సీటును కాపాడుకోవడంతో పాటు.. చుట్టుపక్కల నియోజక వర్గాలు, జిల్లాల్లో ప్రభావం పడేలా చేయడం ద్వారా ద్విముఖ వ్యూహం అనుసరించాలని బీఆర్‌ఎస్‌ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఫైనల్ డెసిషన్ తీసుకోగలిగేది గులాబీ బాస్‌ మాత్రమే.

Advertisement
Advertisement