బాబూ.. మీకెప్పుడు జ్ఞానోదయం అయింది?  | Sakshi
Sakshi News home page

బాబూ.. మీకెప్పుడు జ్ఞానోదయం అయింది? 

Published Mon, Aug 22 2022 4:27 AM

YSRCP Leader Vijaya Sai Reddy comments on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: కులం పేరెత్తితే చెప్పు చూపించండన్న చంద్రబాబుకు.. ఆ తెలివి ఎప్పుడొచ్చిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో టీడీపీలో ఒక నాయకుడు చేరిన సందర్భంగా శ్రావణ శుక్రవారం రోజు చంద్రబాబు చిలుక పలుకులు పలికారని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు అన్ని  కులాలూ తనవే అనుకున్నారట. ఎప్పుడూ కులం గురించి మాట్లాడలేదట. ఆలోచించలేదట. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆయన ఇంకా చాలా ముందుకు వెళ్లి వైఎస్సార్‌సీపీని తిట్టిపోశారు. జనసేన నేతను కాపులతో, తనను కమ్మలతో తిట్టిస్తున్నారంటూ వాపోయారు. ఏ పార్టీ నేతపై ఏ కులానికి చెందిన నాయకుడితో విమర్శలు చేయించాలో చంద్రబాబు ఒక గ్రంథం రాస్తే బావుంటుంది’ అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ఇంకా ఏం చెప్పారంటే.. 

బాబుకు పూనకం వస్తే ఏమైనా మాట్లాడతారు 
► ‘తాను సీఎంగా ఉండగా ఎంతో శ్రమించి హైదరాబాద్‌ నగరానికి కంపెనీల మీద కంపెనీలను రప్పిస్తే ఒక్క కులం వారికే మేలు జరిగిందా?’ అని చంద్రబాబు అమాయకంగా ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ రాజధానికి కుప్పలు తెప్పలుగా వచ్చిన పెట్టుబడుల వల్ల ఏ ఏ కులాలకు చెందిన సంపన్నులు, పేదలు లబ్ధి పొందారో ఆర్థిక వేత్తలను అడిగితే సరైన సమాచారం వస్తుంది. 
► ఆర్థికాభివృద్ధికి సంబంధించి ఏ పరిణామం సంభవించినా సమాజంలోని అన్ని సామాజిక వర్గాలూ ప్రయోజనం పొందితేనే సమ్మిళిత ప్రగతి అవుతుందని అందరికీ తెలుసు. కుల భేదాలు పోవాలంటే ఏం చేయాలో అన్ని రాజకీయ పక్షాలు కలిసి ఆలోచించాలే గానీ.. చంద్రబాబు మాదిరిగా ఆవేశపడి రంకెలేస్తే ప్రయోజనం ఉండదు. 
► ‘మిమ్మల్ని ఎవరైనా కులం అడిగితే, చెప్పు చూపించండి’ అని పిలుపు ఇచ్చిన చంద్రబాబు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇదే పని చేసి ఉంటే బావుండేది. కుల నిర్మూలనకు మహానుభావుడు బాబా సాహెబ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చూపించిన దారి వదిలేసి.. చంద్రబాబు చెప్పిన ‘ చెప్పు చూపించే’ పనిలో పడితే రాష్ట్రం ఎటు పయనిస్తుందో ఊహించడం కష్టం కాదు. 
► ఎంతైనా తనకు ఇష్టమైన ఊరుగా ప్రచారం చేసుకున్న అమరావతికి వచ్చినప్పుడల్లా చంద్రబాబుకు పూనకం వస్తుంది. ఆ పూనకంలో ఆయన ఏమైనా మాట్లాడతారు. వినేవాళ్లుంటే వింత వింత పరిష్కార మార్గాలు చూపిస్తారు.    

Advertisement
Advertisement