వైఎస్సార్‌ పాలన స్వర్ణయుగం: షర్మిల

12 Sep, 2022 02:08 IST|Sakshi
మదనాపురంలో మొక్కజొన్న కంకి  కాలుస్తున్న షర్మిల 

మదనాపురం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలన స్వర్ణయుగమని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర ఆదివారం వనపర్తి జిల్లా మదనాపురం మండలం నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు తిరిగి కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్కవర్గాన్ని కూడా ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీ మోసమేనని, ప్రతి పథకం అబద్ధమేనని విమర్శించారు. ప్రతిపక్షం గట్టిగా ఉంటే కేసీఆర్‌ అరాచకాలు సాగేవి కాదని షర్మిల అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలివ్వండని అడిగితే ఈ జిల్లా మంత్రి నిరంజన్‌రెడ్డి హమాలీ పని చేసుకోండి అని చెబుతున్నారని, డిగ్రీలు, పీజీలు చదివి హమాలీ పనిచేసుకుంటే.. మంత్రి పదవి నీకెందుకని ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఉన్న అర్హులందరికీ రూ.3 వేల పింఛన్‌ ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు అమ్ముడుపోయిన పార్టీలని, ప్రతిపక్షం గట్టిగా ఉంటే కేసీఆర్‌ అరాచకాలు సాగి ఉండేవి కావన్నారు.  

మరిన్ని వార్తలు