క్షీర సిరులు | Sakshi
Sakshi News home page

క్షీర సిరులు

Published Fri, Mar 10 2023 1:22 AM

- - Sakshi

ఒకప్పుడు పాడి పరిశ్రమకు జిల్లా పెట్టింది పేరు. ఒంగోలు గిత్త ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అదేస్థాయిలో పాడి పరిశ్రమ కూడా విరాజిల్లుతూ వచ్చింది. కానీ, గత తెలుగుదేశం పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంది. పాడి పరిశ్రమకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్ర సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమం ద్వారా క్షీర విప్లవానికి అడుగులు పడ్డాయి. ప్రస్తుతం పాల పొంగులతో పాడి రైతన్నల్లో దరహాసం విరబూస్తోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జగనన్న పాల వెల్లువ కార్యక్రమం జిల్లాలో పాల పొంగులా సాగుతోంది. అందుకోసం అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో క్షీర విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ శ్రీకారం చుట్టింది. తెలుగుదేశం హయాంలో నిలువునా మోసపోయిన జిల్లా పాడి రైతుకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. పాడి పరిశ్రమకు పెట్టింది పేరుగా ఉన్న జిల్లాకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం, జిల్లా అధికారులు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. ఒంగోలు డెయిరీని టీడీపీ పాలకమండలి నిలువునా మోసం చేసి సహకార రంగంలో ఉన్న డెయిరీని కంపెనీ యాక్ట్‌లోకి మార్చింది. ఒక పథకం ప్రకారం అప్పుల ఊబిలోకి నెట్టి ఒట్టిపోయిన గేదెలా తయారు చేసింది. ఇదే అదునుగా భావించిన హెరిటేజ్‌ డెయిరీతో పాటు ఇతర ప్రైవేటు డెయిరీలు పాలకు సరైన ధర ఇవ్వకుండా రైతులను నిలువుదోపిడీ చేశాయి. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న ఒంగోలు డెయిరీ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమూల్‌ను రంగంలోకి దించి పాడి రైతులకు పూర్వ వైభవాన్ని సంతరించిపెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించారు. గ్రామాల్లో వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు.

ఆర్థిక పురోభివృద్ధి దిశగా...

జగనన్న పాల వెల్లువతో మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. అందుకు తగ్గట్టుగా మహిళా పాడి రైతులకు అధికారులు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. అమూల్‌ను రంగంలోకి దించి జిల్లా యంత్రాంగం మొత్తాన్ని ‘జగనన్న పాలవెల్లువ’ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. తొలివిడతలో జిల్లాలోని 201 గ్రామాల్లో పాలకేంద్రాలను ప్రారంభించారు. 2020 నవంబర్‌ నుంచి తొలుత ప్రారంభించిన పాల కేంద్రాల్లో పాలు సేకరించేందుకు 20 రూట్లు ఏర్పాటు చేశారు. ఇటీవల మరో 43 కేంద్రాలను విస్తరింపజేశారు. ప్రస్తుతం 244 గ్రామాల్లో కేంద్రాలు ఉన్నాయి. ప్రతిరోజూ 18,500 నుంచి 20 వేల లీటర్ల పాలు సేకరించే విధంగా ఏర్పాట్లు చేసి సమీకరిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు జిల్లాలో 91.81 లక్షల లీటర్ల పాలు సేకరించారు. అందుకుగానూ రూ.58.18 కోట్లు మహిళా పాడి రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేశారు.

పాడి గేదెల ద్వారా ప్రోత్సాహం...

పాడి రైతులకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా అధికారులు ‘జగనన్న పాల వెల్లువ’ పథకం ద్వారా మహిళలకు పాడి గేదెలను అందజేసి ప్రోత్సహిస్తున్నారు. పాలుపోసే రైతులకు పాడి గేదెల కొనుగోలు కోసం వివిధ సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. డీఆర్‌డీఏ ద్వారా ఈ పథకాన్ని వేగవంతంగా మహిళా పాడి రైతులకు విరివిగా బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా సహకార బ్యాంకుల నుంచి పాడి పశువుల కొనుగోలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎక్కువ మోతాదులో పాలిచ్చే ముర్రా జాతి గేదెలతో పాటు ఇతర మేలు రకం జాతి గేదెల కొనుగోలు చేపట్టారు. ఒక్కో గేదెను రూ.లక్ష వెచ్చించి కొనుగోలు చేయడానికి పూనుకున్నారు. కొనుగోలుకు వర్కింగ్‌ కేపిటల్‌ కింద ఒక్కొక్క గేదెకు ప్రధాన మంత్రి పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.30 వేలు, బ్యాంకుల ద్వారా రూ.70 వేలు అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 4,925 మంది మహిళా రైతులకు రూ.49.53 కోట్లను రుణాల రూపంలో అందించారు. సహకార బ్యాంకుతో పాటు కమర్షియల్‌ బ్యాంకుల ద్వారా రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా సెర్ప్‌ ద్వారా పాడి రైతులకు రుణాలు అందజేశారు. గ్రామ స్థాయిలో పాల వెల్లువ కేంద్రాల ఏర్పాటుకు వలంటీర్ల ద్వారా సర్వే చేయిస్తున్నారు. పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. పాల వెల్లువకు పాలుపోసే మహిళా రైతుల పశుగణాభివృద్ధి కోసం రైతు భరోసా కేంద్రాల ద్వారా పశుగ్రాస విత్తనాలు, దాణామృతం (టీఎంఆర్‌), 40 శాతం రాయితీపై పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసే ఛాఫ్‌ కట్టర్స్‌ను రైతులకు అందించనున్నారు.

మహిళల అర్థికాభివృద్ధే లక్ష్యంగా...

గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. జగనన్న పాల వెల్లువ కార్యక్రమం ద్వారా మహిళా పాడి రైతులకు జీవనోపాధి కల్పిస్తున్నాం. ఎలాంటి షూరిటీలు లేకుండా పాలు పోసే మహిళా పాడి రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలిప్పిస్తున్నాం. గ్రామాల్లో ప్రతి ఇంటిలో పాడి పరిశ్రమ ఉండేలా ప్రణాళికలు రూపొందించాం.

– డాక్టర్‌ కొప్పరపు బేబీరాణి, జాయింట్‌ డైరెక్టర్‌, జిల్లా పశుసంవర్థకశాఖ

అనేక పథకాల ద్వారా పాడి రైతులకు ప్రోత్సాహం

జగనన్న పాల వెల్లువ పథకంలో మహిళా పాడి రైతులకు అనేక పథకాల ద్వారా ఆర్థికసాయం అందిస్తూ ప్రోత్సహిస్తున్నాం. చేయూత, ఆసరా, శ్రీనిధి, ఉన్నతి, సెర్ప్‌ ద్వారా రుణాలందిస్తున్నాం. పీడీసీసీబీతో పాటు అన్ని జాతీయ బ్యాంకుల నుంచి ఒక్కొక్కరికి రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాం. డీఆర్‌డీఏ సిబ్బందితో పాటు గ్రామాల్లో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై సర్వే చేయిస్తున్నాం.

– బి.బాబూరావు, పీడీ, డీఆర్‌డీఏ

జగనన్న పాల వెల్లువకు ప్రత్యేక ప్రణాళిక జిల్లాలోని 244 గ్రామాల్లో కేంద్రాలు మిగతా గ్రామాలకు విస్తరించేందుకు చర్యలు గ్రామ స్థాయిలో వలంటీర్ల ద్వారా సర్వే ఇప్పటి వరకు 4,925 మంది మహిళా పాడి రైతులకు లబ్ధి గేదెల కొనుగోలుకు రూ.49.53 కోట్లు అందజేత పాడి రైతులను నిలువునా మోసం చేసిన టీడీపీ భరోసా కల్పిస్తున్న వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం

1/2

2/2

Advertisement
Advertisement