బాతులు.. బంగారం | Sakshi
Sakshi News home page

బాతులు.. బంగారం

Published Sun, Jun 25 2023 11:30 AM

- - Sakshi

బాతుగుడ్లు బంగారం కానున్నాయి. కాసుల వర్షాన్ని కురిపించనున్నాయి. మహిళలు ఆర్థికంగా ఎదగడంలో ఇవి భాగస్వామ్యం కానున్నాయి. బాతుగుడ్ల హేచరీల ఏర్పాటుతో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చు. అత్యాధునిక పరికరాలు సైతం అందుబాటులోకి రావడం నిర్వాహకులకు వరంగా మారనుంది. జిల్లాలో సింగరాయకొండ మండలంలో ఏకంగా 11 హేచరీలు అందుబాటులోకి రానున్నాయి. ఇవి సోమవారం ప్రారంభమవుతున్నాయి.

సింగరాయకొండ: డ్వాక్రా మహిళలు ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సెర్ప్‌, బ్యాంకుల సౌజన్యంతో ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్‌ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా సబ్సిడీ పై రుణాలను అందిస్తోంది. దీని కింద సింగరాయకొండ మండలంలో 11 బాతుగుడ్ల హేచరీలు ఏర్పాటు కానున్నాయి. సింగరాయకొండ మండలంలోని కనుమళ్ల పంచాయతీ పెద్ద కనుమళ్ల, మూలగుంటపాడు గ్రామాల్లో వీటిని ప్రారంభించనున్నారు. నాలుగు నెలల క్రితం సెర్ప్‌ సూచనలతో డీఆర్‌డీఏ పీడీ బీ బాబూరావు ఆధ్వర్యంలో పెద్ద కనుమళ్లలో అవగాహన సమావేశాలు నిర్వహించారు. 35 మంది మహిళలు హేచరీల ఏర్పాటుకు ముందుకు వచ్చారు. చివరకు 11 మందితో యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కో యూనిట్‌ రూ.11 లక్షలు
ఒక్కో యూనిట్‌కు రూ.11 లక్షల వరకూ వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. రూ.లక్ష లబ్ధిదారురాలు భరిస్తే రూ.10 లక్షల రుణం సబ్సిడీపై బ్యాంకులు రుణాలు ఇస్తాయి. డ్వాక్రా సంఘం సభ్యురాలైతే చాలు ఎటువంటి హామీలు లేకుండా వ్యక్తిగత రుణం అందిస్తుంది. మిషన్‌ కొనుగోలుకు రూ.7.16 లక్షలు, జనరేటర్‌ కొనుగోలుకు రూ.3.93 లక్షలు ఖర్చవుతుంది. మిషన్‌ ఏర్పాటైన తరువాత వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్‌ ఇస్తారు. ఈ సర్టిఫికెట్‌ను బ్యాంకుకు ఇవ్వగానే వీరికి రావాల్సిన సబ్సిడీ మొత్తం రూ.3.50 లక్షలు వెంటనే లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు జమవుతుంది. మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. మిషన్‌ ఏర్పాటుకు అవసరమైన షెడ్‌ను మాత్రం లబ్ధిదారులు నిర్మించుకోవాలి.

సబ్సిడీ ఇలా..
గతంలో డ్వాక్రా సంఘాలకు రుణాలు ఇచ్చేవారు. తాజాగా వ్యక్తిగతంగా సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తున్నారు. వ్యక్తిగత హామీపై రూ.2 లక్షల నుంచి పది లక్షలు, ప్రాపర్టీ షూరిటీపై రూ.50 లక్షల వరకు రుణాలు ఇస్తారు. గ్రామీణ ప్రాంత మహిళలకు 35 శాతం, పట్టణ ప్రాంత మహిళలకు 25 శాతం సబ్సిడీ వస్తుంది. ఈ యూనిట్ల ఏర్పాటుకు ఎటువంటి పరిమితులు లేవు. ఎంతమందికై నా రుణాలు ఇస్తారు. అయితే డ్వాక్రా సంఘంలో సభ్యురాలై ఉండాలి.

గుడ్డు రూ.7 .. పిల్ల రూ.20:
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి గుడ్లను తెచ్చుకుంటారు. రూ.6 నుంచి రూ.7 లకు కొనుగోలు చేస్తారు. 28 రోజుల పాటు పొదుగుతారు. వచ్చిన వాటిని ఒక్కో పిల్లను రూ.18 నుంచి రూ.20 మధ్య విక్రయిస్తారు. ప్రస్తుతం అధునాతన పరికరాలు, జనరేటర్‌ అందుబాటులోకి రావడంతో గుడ్ల డ్యామేజీ తగ్గుతుంది. గతంలో 10 వేల గుడ్లు తీసుకొస్తే కరెంటు కోతలు, వాతావరణ ప్రభావాలతో దాదాపు 50 శాతం పాడైపోయేవి. ప్రస్తుతం కరెంటు పోతే జనరేటర్‌ అందుబాటులోకి రావడంతో డ్యామేజీ తగ్గుతుంది. పిల్ల నాణ్యత, ఎదుగుదల కూడా బాగుంటుంది. పాత మిషన్లకు, వీటికి కరెంటు బిల్లు నెలకు సుమారు రూ.15 వేలు తక్కువ అవుతుంది. గతంలో అసలు వచ్చేది. ప్రస్తుతం లాభాలే తప్ప నష్టం అనేది ఉండదు. పిల్లల్ని తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌, కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు.

టీడీపీ హయాంలో నిధుల కొరత
గత తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మండలానికి రూర్బన్‌ పథకం మంజూరైంది. పరిశ్రమల ఏర్పాటుకు కోటి రూపాయలు కేటాయించారు. ఆ సమయంలో ఇద్దరు హేచరీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. అయితే నిధులు రాకపోవడంతో అవి ఏర్పాటు కాలేదు.

గతంలో అంతా నష్టమే..
పెద్ద కనుమళ్ల ఎస్టీ కాలనీలో లబ్ధిదారులు గతంలో షెడ్‌, మిషన్‌ ఏర్పాటు చేసుకుని హేచరీ నిర్వహించారు. ఖర్చుకు తగ్గ ఆదాయం రాకపోవటంతో అవి మూతపడ్డాయి. పాత మిషన్‌లో కేవలం 15 ట్రేల ఏర్పాటుకు అవకాశం ఉండగా కొత్త మిషన్‌లో 60 ట్రేలు ఏర్పాటుకు చేసుకోవచ్చు. దీంతో ఒకేసారి ఎక్కువ పిల్లలు ఉత్పత్తి చేయటానికి అవకాశం కలగటంతో ఖర్చు గణనీయంగా తగ్గి లాభదాయకంగా ఉంటుందని లబ్ధిదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బాతుగుడ్ల మిషన్‌ లోపలి  భాగాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ అధికారులు
1/1

బాతుగుడ్ల మిషన్‌ లోపలి భాగాన్ని పరిశీలిస్తున్న డీఆర్‌డీఏ అధికారులు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement