నేడు విద్యార్థులకు పోటీలు | Sakshi
Sakshi News home page

నేడు విద్యార్థులకు పోటీలు

Published Tue, Nov 14 2023 1:44 AM

కేవీ శేషమ్మకు నియామక పత్రం అందిస్తున్న జిల్లా అధ్యక్షుడు బలగాని ఆంజనేయులు - Sakshi

ఒంగోలు: ఖాదీ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా స్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి వీఎస్‌ సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో విజేతలైన వారికి ఈనెల 14న స్థానిక సెయింట్‌ థెరెస్సా స్కూలు ఆవరణలో ఉదయం 9.30 గంటలకు పోటీలు నిర్వహిస్తారన్నారు. మండల విద్యాశాఖ అధికారులు మండల స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రథమ విజేతను జిల్లా స్థాయి పోటీలకు పంపాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ వెంట రైటింగ్‌ ప్యాడ్లు తెచ్చుకోవాలన్నారు.

బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షురాలిగా శేషమ్మ

ఒంగోలు: ఏపీ బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షురాలిగా కేవీ శేషమ్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు పంపిన నియామక పత్రాన్ని స్థానికంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బలగాని ఆంజనేయులు, గౌరవాధ్యక్షుడు గోనుగుంట్ల బ్రహ్మానందశర్మ అందించారు. ఈ సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, జిల్లా జంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పావల్ల రాసయ్య, 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ అంబటి ప్రసాదరావు, మూడో క్లస్టర్‌ ఇన్‌చార్జి బొమ్మినేని మురళి, శ్రీవిశ్వ వికాస భారతి సేవా సంస్థ, వెంకటేశ్వర కాలనీ వాసులు పలువురు అభినందనలు తెలిపారు.

ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా షేక్‌ ఖాసిం వలి

ఒంగోలు సెంట్రల్‌: ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘ నూతన అధ్యక్షుడిగా షేక్‌ ఖాసిం వలి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒంగోలు ప్రెస్‌ క్లబ్‌లో ఆదివారం ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘ సమావేశం నిర్వహించారు. మర్రిపూడి మండలం తంగెళ్ల గ్రామానికి చెందిన షేక్‌ ఖాశిం వలి సంఘ సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా ఎన్నికై న ఖాసిం వలికి పలువురు అభినందనలు తెలిపారు. త్వరలోనే అభినందన సభను నిర్వహిస్తారని, ఈ కార్యక్రమానికి దళిత సంఘాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని మైనార్టీ సంఘ నాయకులు షేక్‌ వలి, మహమ్మద్‌ బాష తెలిపారు.

క్రీడలపై ఆసక్తి పెంచండి

ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి

మార్కాపురం: తల్లిదండ్రులు విద్యార్ధి దశ నుంచే తమ పిల్లలకు క్రీడలపై ఆసక్తిని పెంచేలా కృషి చేయాలని ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి సూచించారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ క్రీడా వికాస కేంద్రంలో ఆది, సోమవారాల్లో మార్కాపూర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ యోగా క్లబ్‌ ఆధ్వర్యంలో డివిజన్‌ స్ధాయి బాలబాలికల అండర్‌ 15 షటిల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వలన శారీరక, మానసిక వికాసం కలుగుతుందని, విద్యార్ధుల మధ్య ఐక్యత వస్తుందన్నారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 24 టీముల్లో బాలికలు, 118 టీముల్లో బాలురు పాల్గొన్నట్లు క్లబ్‌ అధ్యక్షుడు బీ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. బాలుర విభాగంలో ప్రథమ స్ధానంలో షకీల్‌, నర్సింహ నాయక్‌, ద్వితీయ విజేతలుగా అభి, హర్ష, మూడో విజేతలుగా ఫిరోజ్‌, ఫణి గెలుపొందారు. బాలికల విభాగంలో ప్రథమ స్ధానంలో త్రిభువన శ్రీ, లక్ష్మీ మేఘన, ద్వితీయ స్ధానంలో కీర్తి, హాసిని, తృతీయ స్ధానంలో సుస్మిత, హర్షిణిలు గెలుపొందినట్లు తెలిపారు. విజేతలకు బహుమతులు అందించారు. మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచర్ల బాల మురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ షేక్‌ ఇస్మాయిల్‌, ఎంఈఓలు రాందాస్‌నాయక్‌, టి. శ్రీనివాసరావు, అధ్యక్షుడు అమీర్‌బాషా, నిర్వాహకులు టి సత్యం, గుంటక సుబ్బారెడ్డి, కుందురు శ్రీనివాసరెడ్డి, బీ కాశయ్య, నాగేశ్వరరావు, ఆంజనేయులు, చాంద్‌బాషా, అమర్నాధ్‌, అర్జున్‌, కౌన్సిలర్‌ బుస్సెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేపీ
1/2

పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేపీ

షేక్‌ ఖాసిం వలి
2/2

షేక్‌ ఖాసిం వలి

Advertisement
Advertisement