లైన్‌ క్లియర్‌ | Sakshi
Sakshi News home page

లైన్‌ క్లియర్‌

Published Sun, Dec 24 2023 1:44 AM

ఒంగోలు – కొత్తపట్నం రోడ్డులోని బకింగ్‌ హాం కెనాల్‌ బ్రిడ్జి  - Sakshi

హై లెవల్‌ వంతెనకు

టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధి అవినీతితో బకింగ్‌ హాం కెనాల్‌పై నిలిచిపోయిన హైలెవల్‌ బ్రిడ్జి పూర్తి చేసేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. 2016లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణ పనులు 2018లో పూర్తి కావాల్సి ఉన్నా.. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ తీరుతో పనులు ముందుకు సాగలేదు. ఫలితంగా వంతెన నిర్మాణ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో పనులు వేగవంతమయ్యాయి. పెరిగిన అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.20.57 కోట్లు తీసుకొచ్చేలా కృషి చేశారు. మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

బ్రిడ్జి పనులు వేగవంతం చేసిందే బాలినేని...

ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కోరుతూ వచ్చారు తప్ప, కాంట్రాక్టర్‌ను ఎక్కడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అయితే టీడీపీ హయాంలో పనులు మొదలుపెట్టిన కాంట్రాక్టర్‌.. ప్రస్తుతం పనులు చేస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్‌ వద్ద కమీషన్లకు దామచర్ల జనార్దన్‌ కక్కుర్తిపడ్డా.. రాజకీయ కుట్రలో భాగంగా పనులు నత్తనడకన జరుగుతున్నాయని గ్రహించిన బాలినేని.. పనులు వేగవంతం చేయాలని, లేదంటే చర్యలు తప్పవంటూ కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. అప్పటి నుంచి పనుల్లో వేగం పెరిగింది. త్వరలో పనులు పూర్తవుతాయని తెలుసుకున్న జనార్దన్‌ రాజకీయ డ్రామాకు తెరతీశారు. బ్రిడ్జి వద్ద ఆందోళన చేపట్టి తన ఆందోళన కారణంగానే పనులు వేగవంతంగా జరుగుతున్నాయనే కలరింగ్‌ ఇచ్చుకునే కుయుక్తులకు పథక రచన చేస్తూ వచ్చారు. బాలినేని వంతెన పూర్తి చేసేందుకు ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం రూ.20.57 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు సిద్ధమవుతున్నారు. సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చేసి ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తున్న బాలినేనిని ప్రజలు అభినందిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులో బకింగ్‌ హాం కెనాల్‌పై నిర్మిస్తున్న హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. నాటి తెలుగుదేశ ప్రభుత్వం నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల తీరుతో వంతెన నిర్మాణ వ్యయం పెరుగుతూ వచ్చింది. పెరిగిన అంచనాల మేరకు రూ.20.57 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు – కొత్తపట్నం రాకపోకలు సాగించే ప్రజల ఇబ్బందులు తప్పించేందుకు వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతో కృషి చేశారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు రాబట్టారు. వాస్తవానికి సకాలంలో వంతెన పనులు పూర్తి చేసి ఉంటే కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కు పోయేవికావు. 2018 ఫిబ్రవరి 28వ తేదీ నాటికే బకింగ్‌ హాం కెనాల్‌ వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ, టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న దామచర్ల జనార్దన్‌ చేసిన పాపాలు బకింగ్‌ హాం కెనాల్‌ వంతెనకు శాపంలా మారాయి. ఆయన అవినీతికి, నిర్లక్ష్యానికి ఈ వంతెన బలైంది. దీంతో కొత్తపట్నం మండల ప్రజలతో పాటు కొత్తపట్నం బీచ్‌కు వెళ్లే ప్రజలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఇందుకు ప్రధాన కారణంగా ఉన్న దామచర్ల జనార్దన్‌ను ప్రజలు చీత్కరించుకుంటున్నారు.

2018 ఫిబ్రవరిలోనే పూర్తి కావాల్సిన బ్రిడ్జి...

ఒంగోలు–కొత్తపట్నం ఆర్‌అండ్‌బీ రోడ్డులో ఉన్న బకింగ్‌ హాం కెనాల్‌పై వంతెన నిర్మాణ పనులు వాస్తవానికి 2018 ఫిబ్రవరి 28వ తేదీ నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే, దామచర్ల నియంత పోకడతో పనులు ముందుకు సాగలేదు. శిథిలావస్థకు చేరుకుంటున్న పాత వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2015లో రూ.7 కోట్లతో ప్రతిపాదిత అంచనాలు రూపొందించారు. దానిని కాస్తా రూ.14 కోట్లకు పెంచుతూ 2016 రివైజ్డ్‌ ఎస్టిమేషన్స్‌ తయారు చేసి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి పంపారు. హైదరాబాద్‌కు చెందిన మెస్సర్స్‌ కాన్‌టెక్‌ సిండికేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి చెందిన కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ (నంబర్‌–78/2016) చేసుకుని వంతెన నిర్మాణానికి 2016 ఆగస్టు 31న స్థలాన్ని అప్పగించారు. వంతెన నిర్మాణ పనులు మొత్తం 18 నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు అగ్రిమెంట్‌ ఇచ్చారు. అంటే, 2018 ఫిబ్రవరి 28వ తేదీతో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేసి ఆర్‌అండ్‌బీ అధికారులకు కాంట్రాక్టర్‌ అప్పగించాల్సి ఉంది. అప్పటికీ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిధులు సక్రమంగా విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్‌కు 2021 జూన్‌ 30వ తేదీ వరకు అగ్రిమెంట్‌ పొడిగించారు.

ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్‌హాం కెనాల్‌పై బ్రిడ్జి పూర్తి చేసేందుకు మార్గం సుగమం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో నిధుల కేటాయింపు పెరిగిన అంచనాలతో రూ.20.57 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం దామచర్ల పాపం వంతెనకు శాపంగా మారిన వైనం 2018 ఫిబ్రవరి 28వ తేదీ నాటికే పూర్తి కావాల్సిన పనులు బ్రిడ్జిని అడ్డుపెట్టుకుని నాడు కమీషన్లు దండుకున్న దామచర్ల నేడు పనులు పూర్తి కావడం లేదంటూ రాజకీయ డ్రామాలు

నాడు కమీషన్లకు కక్కుర్తిపడి...

ఆనాడు కమీషన్లకు కక్కుర్తిపడి సొంత సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి బ్రిడ్జి కాంట్రాక్టు పనులను దామచర్ల జనార్దన్‌ అప్పగించారు. పనులు వేగంగా జరుగుతున్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. అతని రాజకీయ డ్రామాలు తెలుసుకున్న ప్రజలు 2019లో జరిగిన ఎన్నికల్లో ఓడించారు. దీంతో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను అడుగడుగునా అడ్డుకునే కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అందుకు ఒంగోలు నగరం, మండలాల్లో జరిగే ఎన్నో పనులు ఉదాహరణలుగా చెప్పవచ్చు. ప్రజలపై ఉన్న కోపమో, బాలినేనిని ఎదుర్కొలేకపోతున్నాననే బాధో తెలియదుగానీ, ప్రజలపై కక్షసాధింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. కరోనా కారణంగా సుమారు రెండేళ్లపాటు ప్రజలు అల్లాడిపోయినా హైదరాబాద్‌కు, బెంగళూరుకు దామచర్ల జనార్దన్‌ పరిమితమయ్యారు తప్ప, జనం ఇబ్బందులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని మాత్రం నిత్యం ప్రజలతో ఉంటూ జీజీహెచ్‌లో వంద పడకలు ఏర్పాటు చేసి కోవిడ్‌ బాధితులకు కావాల్సిన ఆక్సిజన్‌, మందులు, భోజనం ఉచితంగా అందించారు. అంతేగాకుండా నగర ప్రజలందరికీ నిత్యవసర సరుకులు అందిస్తూ వారితో మమేకమయ్యారు. దీన్ని జీర్ణించుకోలేక దామచర్ల జనార్దన్‌ అండ్‌ కో.. బాలినేనిపై ఎన్నో కుట్రలు, కుయుక్తులు పన్నుతూనే ఉన్నారు. బాలినేని ఎంతో కష్టపడి ఒంగోలు నగరంలోని 25 వేల మంది నిరుపేదలకు యరజర్ల వద్ద ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు పూనుకుంటే.. కోర్టుకు వెళ్లి వాటిని కూడా ఆపేయించి పేదల ఉసురు పోసుకుంటున్నాడు దామచర్ల. అంతటితో ఆగకుండా ఒంగోలు–కొత్తపట్నం రోడ్డులోని బకింగ్‌ హాం కెనాల్‌ బ్రిడ్జి వద్ద ధర్నా అంటూ మరో రాజకీయ డ్రామాకు తెరతీశారు. అసలు బ్రిడ్జి నిర్మాణం విషయానికొస్తే జనార్దన్‌ జేబులు నింపుకోవడానికే దీన్ని ఉపయోగించుకున్నారు తప్ప, ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించిన దాఖలాలు లేవని ఒంగోలు నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు.

1/1

Advertisement
Advertisement