7న కొండపిలో మెగా జాబ్‌మేళా | Sakshi
Sakshi News home page

7న కొండపిలో మెగా జాబ్‌మేళా

Published Mon, Mar 4 2024 1:30 AM

జాబ్‌మేళా పోస్టర్‌ను 
ఆవిష్కరిస్తున్న మంత్రి సురేష్‌ - Sakshi

సింగరాయకొండ (మర్రిపూడి): కొండపి మండల కేంద్రంలోని సీతారామ కళ్యాణ మండపంలో ఈనెల 7వ తేదీ గురువారం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో తన సహకారంతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. సింగరాయకొండ మండల కేంద్రంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో జాబ్‌మేళా గోడపత్రికను ఆవిష్కరించారు. మంత్రి సురేష్‌ మాట్లాడుతూ ఈ జాబ్‌మేళాలో సుమారు 70 కంపెనీలు పాల్గొంటాయని, పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ చదివిన వారు కూడా ఈ మేళాకు రావచ్చన్నారు. ఈ జాబ్‌మేళాలో పాల్గొనే కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగులకు అవసరమైన అన్ని రకాల వసతులతో పాటు భోజన వసతి కూడా తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.

ఇన్విజిలేటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు రిలీవ్‌ కావాలి

ఒంగోలు: ప్రైవేటు జూనియర్‌ కాలేజీలలో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు తక్షణమే పరీక్షల విధుల నుంచి రిలీవ్‌ కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశాల మేరకు రిలీవ్‌ అయిన ఉపాధ్యాయులు సోమవారమే వారి పాఠశాలల్లో విధుల్లో చేరాలన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపూ లేదన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 4వ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ సిలబస్‌ పూర్తిచేయాలని, సిలబస్‌ పూర్తిచేయకుండా సమ్మేటివ్‌ 2 పరీక్షలకు విద్యార్థులను హాజరుపరిస్తే నేరంగా భావిస్తామని హెచ్చరించారు. ప్రతి ఉపాధ్యాయుడు అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సిలబస్‌ పూర్తిచేసి పరీక్షలకు సంసిద్ధులను చేయాలని, మండల, ఉప విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisement
Advertisement