ఎంబీబీఎస్‌ ప్రవేశాలు | Sakshi
Sakshi News home page

ఎంబీబీఎస్‌ ప్రవేశాలు

Published Wed, Jul 19 2023 12:34 AM

- - Sakshi

సిరిసిల్ల: జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ భవనం సిద్ధమైంది. సిరిసిల్ల, వేములవాడ పాత తాలూకా ప్రాంతాలతో రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఆవిర్భవించడం.. రాష్ట్రంలోనే భౌగోళికంగా, జనాభా పరంగా చిన్న జిల్లాగా ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం అగ్రస్థానంలో నిలుస్తూ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు అవుతుంది.

పట్టణ శివారులోని పెద్దూరు బైపాస్‌ రోడ్డులో పది ఎకరాల స్థలంలో రూ.40 కోట్లతో మెడికల్‌ కాలేజీ భవనం, విద్యార్థుల హాస్టళ్ల భవనాలు శరవేగంగా నిర్మాణమవుతున్నాయి. ఆగస్ట్‌ మొదటి వారంలోగా పనులు పూర్తి కానున్నాయి. రెండో వారంలో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం వైద్య విద్య తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు.

ఎన్‌ఎంసీ అనుమతులు

జిల్లా కేంద్రంలో వైద్య విద్యను బోధించే మెడికల్‌ కాలేజీని మంజూరు చేస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) న్యూఢిల్లీ లెటర్‌ ఆఫ్‌ ఇన్‌టెంట్‌(ఎల్‌వోటీ) నం.ఎన్‌ఎంసీ/యూజీ/2023– 2024/000033/ 021 475 తేదీ: 21.0.4.2023ను జారీ చేసింది. కాలోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల మెడికల్‌ కాలేజీకి వంద ఎంబీబీఎస్‌ సీట్లు కేటాయించారు.

ఈ ఏడాది ఆగస్ట్‌ మొదటి వారంలో మెడికల్‌ కాలేజీలో అడ్మిషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారికంగా మెడికల్‌ కాలేజీకి అనుమతి లభించింది.

ఎంబీబీఎస్‌ తరగతులకు శ్రీకారం

సిరిసిల్ల మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ ఏడాది వంద సీట్లు కేటాయించగా, ఇందులో 15 సీట్లు ఆలిండియా కోటాలో కేటాయిస్తారు. మరో 85 మన రాష్ట్ర అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 40 శాతం బాలురు, 60 శాతం సీట్లు బాలికలకు ఉంటాయి. ఆగస్ట్‌ మొదటి వారంలో కౌన్సెలింగ్‌ ఉంటుంది. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో మొత్తం 340 బెడ్స్‌ సిద్ధం చేశారు. పెద్దూరు వద్ద నిర్మించిన సొంత భవనంలోనే ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభిస్తారు. హాస్టల్‌ భవనాలు నిర్మాణంలో ఉండగా, అబ్బాయిలు, అమ్మాయిల కోసం వేర్వేరు ప్రైవేటు భవనాలు సిద్ధం చేశారు.

సిరిసిల్లకు వచ్చిన ప్రొఫెసర్లు

సిరిసిల్ల మెడికల్‌ కాలేజీకి ప్రభుత్వం సిబ్బందిని కేటాయించింది. అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బంది కేటాయింపులు జరిగాయి. ఇప్పటికే 55 మంది సిబ్బందిని కేటాయించారు. మెడికల్‌ కాలేజీ ప్రారంభమైతే సుమారు వంద మంది డాక్టర్లు అందుబాటులో ఉంటారు. మొత్తంగా మెడికల్‌ కాలేజీలో సుమారు 700 మంది సిబ్బంది అందుబాటులో ఉంటారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చిన బోధన సిబ్బంది, ఇతర డాక్టర్లు జిల్లా ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు.

సీఎంతో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

సిరిసిల్ల మెడికల్‌ కాలేజీని సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోనరావుపేట మండలం మల్కపేట వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–9లో నిర్మించిన జలాశయం, జిల్లా పోలీస్‌ ఆఫీస్‌ భవనాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. మెడికల్‌ కాలేజీ ప్రారంభంతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయి. పట్టణంలోని జిల్లా ఆస్పత్రి పూర్తి స్థాయిలో మాతాశిశు సంరక్షణ, నవజాత శిశువుల కేంద్రంగా మారుతుంది. జనరల్‌ ఆస్పత్రి మొత్తంగా మెడికల్‌ కాలేజీకి మార్చడంతో పెద్దూరు శివారులోని మెడికల్‌ కాలేజీ బోధన ఆస్పత్రిగా ఉంటుంది. అన్ని రకాల వైద్యసేవలు, ఆధునిక పరికరాలతో అందుబాటులోకి వస్తుంది.

ఆగస్టులో తరగతులు..

రాజన్న సిరిసిల్ల మెడికల్‌ కాలేజీలో ఆగస్ట్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. భవన నిర్మాణ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. మొదటి ఏడాది వైద్యపాఠాలు బోధించేందుకు మౌలిక వసతులు సమకూరాయి. – డాక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ న్యూస్‌రీల్‌

Advertisement
Advertisement